బాలీవుడ్ మొత్తం నమ్మకద్రోహంతోనే నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది సీనియర్ నటి రిచా చద్దా! ఇక్కడ చాలా తక్కువ మందికే విలువలు, ధైర్యం ఉంటాయని చెప్పుకొచ్చింది. తాజాగా, తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. రెండేండ్లపాటు సినిమాలకు విరామం ఇచ్చింది రిచా. మళ్లీ షూటింగ్‌కు వెళ్తూ.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో తాను పడిన వేదన, ఇండస్ట్రీలోని నమ్మక ద్రోహాల గురించి చెబుతూ.. ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకున్నది. తన కూతురి తొలి ఫొటోను కూడా షేర్ చేస్తూ పెట్టిన ఈ పోస్ట్.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది.
‘షూటింగ్‌లోకి మళ్లీ త్వరగానే అడుగుపెట్టాలని భావించా! కానీ, నా శరీరం, నా మనసు ఏమాత్రం సహకరించలేదు. డెలివరీ తర్వాతి శారీరక, మానసిక ఇబ్బందులే కాదు.. వృత్తిపరంగా ఎదురైన నమ్మక ద్రోహాలనూ తట్టుకోవాల్సి వచ్చింది’ అంటూ రాసుకొచ్చింది. ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తుల తీరుపైనా తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘కొందరంతే.. తీవ్రమైన ఆత్మన్యూనతా భావంతో, సంకుచిత మనస్తత్వంతో బతుకుతుంటారు. అలాంటివారు సంతోషంగా ఉండలేరు. జీవితంలో ఉన్న ఆనందాన్ని పీల్చేసే రాక్షసులు వారు. నేను బలహీనంగా ఉన్నప్పుడు నా పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించారు. అయినా, వారిని క్షమిస్తాను.
కానీ, వారు చేసిన పనిని మాత్రం ఎప్పటికీ మర్చిపోను’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత తాను మానసికంగా కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టిందని చెప్పుకొచ్చింది. 2008లో వచ్చిన ‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రిచా చద్దా. ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నది. పలు విజయవంతమైన చిత్రాలతో మెప్పించింది. ‘మిర్జాపూర్’ ఫేమ్ అలీ ఫైజల్‌తో పెళ్లిపీటలెక్కింది. ఆ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో చివరిసారిగా కనిపించింది. ఇందులో ‘లజ్జో’ పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. రెండేండ్ల మెటర్నిటీ బ్రేక్ తర్వాత.. పలు కొత్త ప్రాజెక్టులలో భాగమైంది. ‘ఆఖరి సోమవార్’ చిత్రానికి నిర్మాతగా, రచయితగా వ్యవహరిస్తున్నది.