తెలుగు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలిచిన సీనియర్ నటుడు శరత్‌బాబు (71) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత నెల 20న తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయం నుంచి శరత్‌బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాల వైఫల్యం కారణంగా మరణించారని ఏఐజీ వైద్యులు ప్రకటించారు. శరత్‌బాబు మరణంతో తెలుగు సినీరంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సంతాపం ప్రకటించింది. శరత్‌బాబు భౌతికకాయాన్ని చెన్నైకి తరలించి మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
‘రామరాజ్యం’తో సినీరంగ ప్రవేశం
శరత్‌బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షిత్. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 1951 జూలై 31న విజయశంకర దీక్షితులు, సుశీలాదేవి దంపతులకు జన్మించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ చదివారు. ఆ సమయంలోనే నటనపై మక్కువ పెంచుకున్నారు. కాలేజీ రోజుల్లో తొలిసారి వేసిన ‘దొంగనాటకం’ అనే నాటిక మంచి పేరు తీసుకురావడంతో మద్రాస్ వెళ్లి నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోమని మిత్రులు సలహా ఇచ్చారు. మరోవైపు శరత్‌బాబుకు ఐపీఎస్ కావాలనే లక్ష్యం కూడా ఉండేది. అయితే కంటి సమస్యలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
సినిమాల్లో అవకాశం కోసం మద్రాస్‌లో అడుగుపెట్టిన శరత్‌బాబు తొలుత తన అభిమాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును కలుసుకున్నారు. సినిమా అవకాశం కోసం కొద్ది రోజులు వేచి చూడాలని ఆయన సలహా ఇవ్వడంతో శరత్‌బాబు మద్రాస్‌లోనే ఉండిపోయారు. ఈ క్రమంలో రామా విజేత ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమాలో హీరో పాత్ర కోసం నిర్వహించిన ఆడిషన్స్‌లో శరత్‌బాబు పాల్గొన్నారు. వందల మందిలో ఆయన్నే హీరోగా అదృష్టం వరించింది. అలా ‘రామరాజ్యం’ (1973) చిత్రంతో శరత్‌బాబు హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. బాబూరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగ్గయ్య, సావిత్రి, ఎస్వీఆర్ వంటి హేమాహేమీలతో కలిసి తెరను పంచుకున్నారు శరత్‌బాబు. ఈ సినిమా అనంతరం ‘నోము’ ‘అభిమానవతి’ చిత్రాల్లో శరత్‌బాబు విలన్ పాత్రల్లో మెప్పించారు.
విలక్షణ పాత్రల ద్వారా గుర్తింపు
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విభిన్న పాత్రల్లో మెప్పించారు శరత్‌బాబు. హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన అభినయంతో రాణించారు. చూడగానే ఆకట్టుకునే రూపంతో వెండితెర అందగాడిగా పేరు తెచ్చుకున్నారు. హీరోలకు సమానమైన పాత్రల్లో సహాయ నటుడిగా తనదైన ముద్రను వేశారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో జగ్గయ్య తరహాలో కథానాయకులకు సమానమైన పాత్రల ద్వారా తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో పంతులమ్మ, సింహగర్జన, ఇది కథ కాదు, సితార, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అభినందన, సాగరసంగమం, నీరాజనం, అయ్యప్పస్వామి మహాత్యం, కాంచన గంగ, రాధాకల్యాణం, క్రిమినల్, స్వాతిముత్యం వంటి చిత్రాల్లో శరత్‌బాబు అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఉదాత్తమైన పాత్రలతో పాటు సాఫ్ట్విలనీ పాత్రలు పోషించడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇది కథ కాదు’ చిత్రంలో కథానాయికను ప్రేమించి ఆమెను పొందలేని ఆరాధకుడి పాత్రలో ఉదాత్తమైన నటనను కనబరిచారు. ‘గుప్పెడు మనసు’ చిత్రంలో మానసిక క్షోభతో రగిలిపోయే భర్తగా ఆయన నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది.
బాలచందర్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలన్నింటిలో శరత్‌బాబు గొప్ప పాత్రల్ని పోషించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సాగరసంగమం’ చిత్రంలో కమల్‌హసన్ స్నేహితుడిగా..‘స్వాతిముత్యం’ చిత్రంలో రాధిక అన్నయ్య పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో తండ్రితో విభేదించిన కొడుకు పాత్రలో శరత్‌బాబు అభినయం చిరస్థాయిగా నిలిచిపోయింది. ‘కాంచన గంగ’ ‘రాధా కల్యాణం’ చిత్రాల్లో కథానాయకుడిగా తనదైన అభియనంతో ఆకట్టుకున్నారు. పంతులమ్మ, సింహగర్జన, విశ్వనాథ నాయకుడు వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగా మెప్పించిన ఆయన భక్తిప్రధానమైన ‘శ్రీరామదాసు’ ‘అయ్యప్పస్వామి మహాత్యం’ చిత్రాల్లో కరుణరస ప్రధానమైన పాత్రల్లో కనిపించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ ‘అన్వేషణ’ చిత్రాల్లో శరత్‌బాబు పోషించిన పాత్రలు ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ‘సితార’ చిత్రంలో జమిందార్‌గా ఆయన పాత్రకు మంచి పేరొచ్చింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 220పైగా చిత్రాల్లో నటించారు శరత్‌బాబు. ‘అంతరంగాలు’ ‘జనని’ ‘అగ్ని గుండాలు’ వంటి ధారావాహికల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘మళ్లీ పెళ్లి’ త్వరలో విడుదలకానుంది.
రమాప్రభతో విఫలమైన వివాహం
కెరీర్లో నిలదొక్కుకుంటున్న సమయంలోనే తనకంటే నాలుగేళ్లు పెద్దదైన సీనియర్ నటి రమాప్రభను శరత్‌బాబు ప్రేమించారు. అప్పటికే రమాప్రభ స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్నది. కెరీర్ తొలినాళ్లలో శరత్‌బాబుకు ఆమె అండగా నిలిచింది. ఈ బంధం క్రమంగా ప్రేమగా మారడంతో వారిద్దరు 1974లో వివాహం చేసుకున్నారు. పధ్నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత 1988లో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం శరత్‌బాబుపై తీవ్రమైన ఆరోపణలు చేసింది రమాప్రభ. తన ఆస్తి మొత్తం లాక్కున్నాడని, తనను అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడని విమర్శలు చేసింది.
అయితే రమాప్రభ ఆరోపణల్ని ఓ ఇంటర్వ్యూలో ఖండించారు శరత్‌బాబు. రమాప్రభతో తనకు జరిగింది అసలు పెళ్లే కాదని, ఇద్దరం సహజీవనం మాత్రమే చేశామని తెలిపారు. పొలం అమ్మిన డబ్బుతో తానే రమాప్రభకు చెన్నై ఉమాపతి స్ట్రీట్‌లో ఓ ఇల్లు కొనిచ్చానని, ఇప్పుడు దాని విలువ అరవైకోట్లు ఉంటుందని శరత్‌బాబు చెప్పారు. రమాప్రభతో విడాకుల అనంతరం తమిళ నటుడు, నిర్మాత నంబియార్ కూతురు స్నేహలతను వివాహమాడారు శరత్‌బాబు. 21 ఏండ్ల పాటు కలిసి ఉన్న ఈ దంపతులు మనస్పర్థలతో విడిపోయారు. అప్పటి నుంచి శరత్‌బాబు ఒంటరిగానే జీవితాన్ని సాగించారు.
మూడుసార్లు నంది అవార్డులు
దక్షిణాది నాలుగు భాషలతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు శరత్‌బాబు. తనదైన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో పాత్రలకు వన్నె తెచ్చారు. తెలుగులో సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం చిత్రాలకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డుల్ని అందుకున్నారు.
శరత్‌బాబు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సీనియర్ నటుడు శరత్‌బాబు మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 220కిపైగా చిత్రాల్లో నటించిన శరత్‌బాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని సీఎం అన్నారు. శరత్‌బాబు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విలక్షణ నటుడిగా మెప్పించారు – మంత్రి తలసాని
హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా ఏ పాత్రలోనైనా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు శరత్ బాబు. తెలుగుతో పాటు వివిధ భాషల చిత్రాల్లో నటించారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.