హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిలింనగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోట మృతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. 1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావుకు చిన్నతనం నుంచి నటనపై మక్కువ. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా, కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రంగస్థల కళాకారుడైన కోట చదువు పూర్తయ్యాక భారతీయ స్టేట్‌బ్యాంకులో క్యాషియర్‌గా కొన్నాళ్లు పనిచేశారు.
1978లో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో కోట నటుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే, ఉద్యోగ బాధ్యతల కారణంగా ఆ తర్వాత ఐదారేండ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, రంగస్థలానికి మాత్రం దూరం కాలేదు. ఈ క్రమంలో 1985లో వచ్చిన టీ కృష్ణ సినిమా ‘ప్రతిఘటన’ కోటకు నటుడిగా బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించి తెలుగువారి అభిమాన నటుడిగా ఎదిగారు. నటజీవితంలో తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు.
‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాకు సైమా అవార్డును కూడా అందుకున్నారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. ‘ప్రతిఘటన’, ‘అహనా పెళ్లంట’, ‘బావాబావా పన్నీరు’, ‘శివ’, ‘శత్రువు’, ‘గాయం’, ‘మామగారు’, ‘బావ బావమరిది’, ‘అలెగ్జాండర్’, ‘లిటిల్ సోల్జర్స్’, ‘మనీ’, ‘ఆమె’, ‘హలోబ్రదర్’, ‘ఆయనకి ఇద్దరు’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, సాయిధరమ్‌తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర, యువ హీరోలతో నటించారు.
వాజ్‌పేయికి వీరాభిమాని అయిన కోట 1999లో బీజేపీలో చేరారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.
సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిలింనగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
తెలుగు సినీ నటుడు కోట శ్రీనివాస్‌రావు మరణం బాధాకరమని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 750కిపైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా, విలన్‌గా విభిన్న పాత్రలు పోషించిన కోట శ్రీనివాస్‌రావు మరణం తెలుగు సినిమా రంగానికి తీరనిలోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాలుగు దశాబ్దాల నటనా ప్రయాణంలో అనేక విలక్షణమైన పాత్రలు పోషించిన కోట శ్రీనివాస్‌రావు తెలుగు సినిమా పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కోట శ్రీనివాస్ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాయని సినిమాటోగ్రఫీ శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. కోట శ్రీనివాస్‌రావు మృతి ఎంతగానో బాధించిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ తదితరులు కోట మృతికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెండితెరపై విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాస్‌రావు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. ఆయన మరణం విచారకరమన్నారు. కోట శ్రీనివాస్‌రావు మృతితో సినిమా రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకసంద్రంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.