సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగన్‌లో తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచాడు. అక్టోబర్ 31నే ఆయన కన్నుమూయగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈశ్వరరావు తెలుగులో దాదాపు 200 పై చిలుకు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం-నగరం’ ఈశ్వరరావు తొలి చిత్రం.
తొలిసినిమాతోనే నంది అవార్డును సొంతం చేసుకున్నారు ఈశ్వరరావు. ఆ సినిమా తర్వాత ఈశ్వరరావుకి అవకాశాలు ఊపందుకున్నాయి. దేవతలారా దీవించండి, యుగపురుషుడు, ప్రేమాభిషేకం, జయంమనదే, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, దయామయుడు, శభాష్గోపీ, ఘరనామొగుడు తదితర చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు ఈశ్వరరావు.
చిరంజీవి ‘ఘరానామొగుడు’ ఈశ్వరరావు చివరి సినిమా. ఆ సినిమా తర్వాత ఆయన పలు ధారావాహికల్లో కూడా నటించారు. పరిశ్రమలో సౌమ్యుడు, మంచి నటుడిగా పేరుగాంచిన ఈశ్వరరావు మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.