Salman Khan | ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు (Baba Siddique Murder) గురైన విషయం తెలిసిందే. సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. ఈ ఘటన నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు (Security Increased). సల్మాన్, అతని తల్లిదండ్రులు నివసించే బాంద్రాలోని (Bandra Home) గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల దాదాపు డజను మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
కాగా బాబా సిద్ధిఖీ లారెన్స్ బిష్ణోయ్ నుండి బెదిరింపులు అందుకున్న సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే సిద్ధిఖీ గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ నుండి ఎటువంటి బెదిరింపులను అందుకోలేదు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం అనేక సార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు అందుకున్నాడు. 1998 కృష్ణ జింక కేసు నుంచి సల్మాన్ ఖాన్.. బిష్ణోయ్ గాంగ్ టార్గెట్ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఎవరైతే సల్మాన్ ఖాన్‌కు సహాయం చేస్తారో వారి ఖాతాలను సరి చేస్తామంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఇంటి వద్ద మరోసారి భద్రతను పెంచారు. సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్ భద్రతను కల్పిస్తున్న విషయం తెలిసిందే.
సిద్ధిఖీ దారుణ హత్య
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ముంబయి బాంద్రాలోని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. దసరా సందర్భంగా కార్యాలయం బయట కొందరు టపాసులు కాలుస్తుండగా ముఖానికి గుడ్డలు కట్టుకుని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండుగులు తుపాకులతో కాల్పులు జరిపారు.
కఠిన చర్యలు తీసుకుంటాం:షిండే
సిద్ధిఖీ మృతికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘పారిపోయిన వ్యక్తి కోసం పోలీసు టీములు గాలిస్తున్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. బాబా సిద్దిఖీ మరణంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎక్స్‌లో స్పందించారు. ‘నా సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయాను. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. బాబా సిద్దిఖీకి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
హత్య మేమే చేశాం: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
సిద్ధిఖీని తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. తమకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని, అయితే ఎవరైతే గ్యాంగ్‌స్టర్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకుంటారో, ఎవరైతే సల్మాన్ ఖాన్‌కు సహాయం చేస్తారో వారి ఖాతాలను సరి చేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా భావిస్తున్న శుభం రామేశ్వర్ లంకర్ ఫేస్బుక్లో హెచ్చరించాడు. బాబా సిద్ధిఖీ హత్యకు కొన్ని నెలల నుంచే నిందితులు రెకీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే గ్యాంగ్ 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది. తమ ఆరాధ్య జంతువు కృష్ణ జింకను సల్మాన్ చంపడంతో వారు దాడి చేశారు. సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఇంటి వద్ద మరోసారి భారీగా భద్రత పెంచారు.
Also Read..
Air Pollution | దీపావళికి ముందే.. ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత
Cracker Ban | వాయు కాలుష్యం.. ఈసారి కూడా బాణా సంచాపై నిషేధం
Toll Free | మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ముంబైకి వెళ్లే ఆ వాహనాలకు నో టోల్