‘నేను హీరోని కాదు. ఆర్టిస్టుని. ప్రతిభావంతుడైన నటుడిగా పేరుతెచ్చుకోవాలన్నదే నా తపన. నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనుకుంటున్నా’ అన్నారు సత్యం రాజేష్. ఆయన ప్రధాన పాత్రలో డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఊరు పొలిమేర-2’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సత్యం రాజేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘తొలిభాగానికి అద్భుతమైన స్పందన రావడంతో సీక్వెల్ విషయంలో నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. చక్కటి నాణ్యతతో తెరకెక్కించారు. ఈ సినిమాలో షాకింగ్ ట్విస్ట్‌లుంటాయి. మొదటి పార్ట్ చూడకపోయినా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. స్వతహాగా నేను చేతబడుల వంటి వాటిని నమ్మను. అయితే ఫారెస్ట్‌లో షూటింగ్ సందర్భంగా శ్మశానంలో చేతబడుల సన్నివేశాలను షూట్ చేస్తున్నప్పుడు మాత్రం ఎందుకో కాస్త భయం అనిపించింది. ఈ సినిమాలో కథ డిమాండ్ మేరకు ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపిస్తాను. నటుడిగా ఇరవైఏండ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నా. కామెడీతో పాటు నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నా. ‘మా ఊరు పొలిమేర-2’ నా కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమవుతుంది. ప్రస్తుతం ‘టెనెంట్’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నా’ అని చెప్పారు.