‘నేను పరిచయం చేసిన వెంకటేశ్, మహేశ్, తారక్ గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ‘సర్కారు నౌకరి’తో గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను. తను కూడా పెద్ద హీరోగా నిలబడాలి.’ అంటూ ఆకాంక్షించారు ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఆకాశ్, భావన జంటగా ఆయన నిర్మించిన చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకుడు. జనవరి 1న చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడారు. ‘దర్శకుడు శేఖర్ తీసిన ‘పంచతంత్ర కథలు’ నచ్చి పిలిచిమరీ అవకాశం ఇచ్చాను.‘సర్కారు నౌకరి’ నా తరహా సినిమా కాదు. ఇది భావోద్వేగాలతో కూడిన ప్రయాణం.’ అని కె.రాఘవేంద్రరావు చెప్పారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ మంచి పేరు రావాలని గాయని సునీత ఆకాంక్షించారు. హీరోహీరోయిన్లు అద్భుతంగా నటించారని, సాంకేతికంగా అందరూ బాగా సహకరించారని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌తో పాటు శేఖర్ కమ్ముల, అనీల్ రావిపూడి, వి.ఎన్.ఆదిత్య, బి.వి.ఎస్.ఎన్.రవి తదితరులు కూడా మాట్లాడారు.