Mawra Hocane | పాకిస్తాన్ నటి మావ్రా హోకేన్కు షాక్ తగిలింది. సూపర్ హిట్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ సీక్వెల్ నుంచి తొలగిస్తూ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మూవీ నుంచి తొలగిస్తున్నట్లు దర్శకురాలు రాధికా రావు, నిర్మాత్ వినయ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అన్నింటికంటే తమకు దేశమే ముఖ్యం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఏరకమైన ఉగ్రదాడిని ఖండించాల్సిందేనన్నారు. భారతీయ సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేమ, అభిమానాలు సంపాదించిన వారంతా ఉగ్రదాడిని ఖండించకపోవడం బాధాకరమన్నారు. ఉగ్రదాడిని ఎవరైనా సమర్థించడం హేమైందని విమర్శించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ తీసుకున్న నిర్ణయాలను విమర్శించే స్థాయికి వెళ్లడం దురదృష్టకరమన్నారు. తాము భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సనమ్ తేరీ కసమ్-2 మూవీలో హీరోయిన్గా మావ్రా హోకేన్ ఉంటే తాను నటించేందుకు రెడీగా లేనని హీరో హర్షవర్ధన్ రాణే ప్రకటించారు. ఈ క్రమంలో ఆమెను సినిమా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. సనమ్ తేరీ కసమ్ మూవీ 2016లో విడుదలైంది. ఆ సమయంలో రూ.16 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇటీవల ఈ మూవీని రీ-రిలీజ్ చేయగా.. రూ.41కోట్లు రావడం విశేషం. ఈ నేపథ్యంలో సనమ్ తేరీ కసమ్ సీక్వెల్‌ను తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించారు. త్వరలోనే కొత్త హీరోయిన్ను ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి మావ్రా హోకేన్ పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు మండిపడ్డారు.