Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ మూవీ టైటిల్‌కి సంబంధించి నిర్మాత నాగవంశీ నేడు ఒక పోస్ట్ పెట్టాడు. మీ అందరి (విజయ్ అభిమానుల) నిందల తర్వాత.. నేను గౌతమ్‌ను చాలా హింస పెట్టాక.. ఫైనల్‌గా టైటిల్‌ను లాక్ చేశాం. వీడీ 12 టైటిల్ త్వరలోనే వెల్లడిస్తామని నాగవంశీ ట్వీట్ చేశాడు. అయితే నాగవంశీ ప్రకటించడమే ఆలస్యం ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక పేరు హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు సామ్రాజ్యం (Samrajyam) అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. తన సామ్రాజ్యం కోసం విజయ్ ఏం చేశాడు.. ? అనే స్టోరీతో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ టైటిల్ చాలా కొత్తగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో పోలీస్తో పాటు ఖైదీగా విజయ్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.