Samantha | అగ్ర కథానాయిక సమంత గత ఏడాది కాలంగా తన ఆరోగ్య సమస్యలపై ధైర్యంగా పోరాడుతున్నది. మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధికి గురైన ఆమె దాదాపు ఆరు నెలల పాటు చికిత్స తీసుకొని కోలుకుంది. అనంతరం వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం సమంత ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నది. దీనితో పాటు ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌లోనూ భాగమవుతున్నది. అయితే ఇటీవల ఆమె ఆరోగ్యంపై మరలా రూమర్స్ బయలుదేరాయి.
మయోసైటిస్కు చికిత్స తీసుకునేందుకు సమంత అమెరికా వెళ్లనుందని, దాంతో ఏడాది పాటు సినిమాలకు విరామం తీసుకోనుందని వార్తలొచ్చాయి. ఆమె తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది. షూటింగ్ లొకేషన్లో కారవాన్‌లో వున్న ఫొటోను పెట్టిన సమంత..‘ఈ ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయి. ఇక వీటికి ముగింపు పలకాల్సిన తరుణం ఆసన్నమైంది. మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది’ అంటూ రాసుకొచ్చింది. సమంత పోస్ట్‌తో ఆమె అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే త్వరగా కోలుకొని సెట్స్‌లోకి అడుగుపెట్టాలని వారు కోరుకుంటున్నారు.