Samantha | టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇటీవల సినిమాల కన్నా తన పర్సనల్ విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. సోషల్ మీడియాలో పలు ఆసక్తికర పోస్ట్‌లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రీసెంట్గా రాజ్‌తో సన్నిహితంగా ఉన్న పిక్స్ షేర్ చేసి హాట్ టాపిక్ అయింది .కొంత కాలంగా ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని ప్రచారాలు జరుగుతున్న సమయంలో సమంత షేర్ చేస్తున్న పిక్స్ మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సమంత ఇటీవల తన ఆరోగ్యం, వ్యక్తిగత మార్పుల గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
టేక్ 20 హెల్త్ అనే వేదికపై జరిగిన “బయోహ్యాకింగ్ చిట్ చాట్”లో భాగంగా ఆమె తన గతంలో ఎదుర్కొన్న మానసిక, శారీరక సమస్యలు, వాటిని ఎలా అధిగమించిందన్న విషయాలను అందరితో పంచుకున్నారు. సమంత వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ సమయంలో తాను ఫోన్‌కు బాగా అలవాటుపడ్డానని, అది తనపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. ఫోన్ లేకుండా ఉండలేనంతగా అడిక్ట్ అయ్యాను. ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నట్లే ఫీలయ్యాను అని పేర్కొన్నారు. ఆ అలవాటు నుంచి బయటపడేందుకు తాను ‘డిజిటల్ డిటాక్స్’ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఫోన్, సోషల్ మీడియా, ఇతరులతో టచ్ లేకుండా మూడు రోజుల పాటు పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. ఆ టైం లో నన్ను నేను రీసెట్ చేసుకున్నాను అని సమంత వివరించారు. అలా కొన్నిరోజులపాటు చేశాక ఎంతో మారాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆరోగ్య సమస్యల వలన కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన సమంత, ఇప్పుడు తిరిగి సినిమాల్లో అడుగుపెట్టడమే కాకుండా నిర్మాతగా, వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు. సమంత నిర్మాణంలో వచ్చిన శుభం అనే చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది.