అగ్ర కథానాయిక సమంత కెరీర్లో స్పీడ్ పెంచింది. నటనతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా స్వీకరించి సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నది. అనారోగ్య కారణాలతో కెరీర్ కాస్త మందగించడంతో తిరిగి పూర్వవైభవం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆమె నటిస్తూ నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘రక్త్బ్రహ్మాండ్’లో కూడా సమంత భాగమవుతున్నది.
తాజాగా ఈ అమ్మడు తెలుగులో అగ్ర హీరో రవితేజ సరసన నటించబోతున్నదని తెలిసింది. ఒకవేళ ఈ వార్తే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్లో ఇదే తొలిచిత్రమవుతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.
రవితేజ తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ షూటింగ్ పూర్తిచేసుకుంది. సంక్రాంతికి విడుదలకానుంది. ఈ నేపథ్యంలో రవితేజ తన తదుపరి చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వంలో చేయబోతున్నారని, ఈ నెలాఖరులో ఈ సినిమా అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. రవితేజ-శివ నిర్వాణ కాంబోకు సంబంధించిన వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.