Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా నటి స్పందించారు. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.
‘‘యశోద’ ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. అయితే, నేను అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. మనం అన్ని సార్లూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని అర్థమైంది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. నేను పూర్తిగా కోలకునే రోజు అతి దగ్గర్లోనే ఉంది. ఐ లవ్ యూ’ అంటూ రాసుకొచ్చారు. దీంతోపాటు చేతికి సెలైన్ పెట్టుకుని ఉన్న ఫొటోను సామ్ పోస్టుకు జతచేశారు. ఇది చూసిన అభిమానులు సామ్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
మయోసైటిస్ అంటే..?
కండరాల్లో మంటకు దారితీసే ఏ పరిస్థితి అయినా మయోసైటిస్కు దారితీస్తుంది. మయోసైటిస్ మూడు రకాలుగా ఉంటుంది. డెర్మటో మయోసైటిస్, పాలిమయోసైటిస్, ఇన్‌క్లూషన్ బాడీ మయోసైటిస్. డెర్మటోమయోసైటిస్తో బాధపడేవారికి కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. మహిళల్లో , చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి శరీరంపై కనిపిస్తే వారాలు, నెలల్లో నెమ్మదిగా అధ్వానంగా మారుతుంది. మెడ, భుజాలు, వీపుతోపాటు పెద్ద కండరాలను ప్రభావితం చేస్తుంది. మయోసైటిస్‌తో బాధపడుతున్నవారిలో బలహీనత ఎక్కవ కావడంతో కూర్చోవడం, లేవడం కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది.
లక్షణాలు:
దద్దుర్లు, అలసట, చేతులపై చర్మం గట్టిగా మారడం, ఆహారం మింగడంలో ఇబ్బంది, శ్వాస
తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు :
వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతరత్రా సూక్ష్మజీవులు ఈ వ్యాధి రావడానికి
కారణమవుతాయి. వైరస్ లేదా బ్యాక్టీరియా నేరుగా కండరాల కణజాలంపై దాడి చేస్తుంది
లేదా కండరాల ఫైబర్లను దెబ్బతీసే పదార్థాలను విడుదల చేయవచ్చు.