Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గతేడాది మయోసైటిస్ అనే అరుదైన (myositis diagnosis) వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటోంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతోంది. అయితే, మయోసైటిస్ బారిన పడి ఏడాదైన సందర్భంగా సామ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. వ్యాధి బారిన పడిన తర్వాత తను ఎదుర్కొన్న ఇబ్బందులు, తన జీవితంలో వచ్చిన మార్పులను సుదీర్ఘ పోస్టులో వివరించే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం సామ్ ఫ్యామిలీమ్యాన్ రూపకర్తలు తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్ కోసం సెర్బియా (Serbia)లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ సెర్చ్ ఆఫ్ సెయింట్ సావా (Church of Saint Sava)ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. సామ్ ఇలా రాసుకొచ్చింది. ‘వ్యాధి నిర్ధారణ అయి సంవత్సరం అవుతోంది. ఈ ఏడాది ఎప్పుడూ ఊహించని కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశా. ఉప్పు, చక్కెర లేని ఆహారం తీసుకున్నా. నిజం చెప్పాలంటే మందులే ఆహారం అయ్యాయి. కొన్ని బలవంతంగా మానేయాల్ని వచ్చింది. ఇష్టం లేకున్నా కొన్ని అలవాటు చేసుకున్నా. ఆలోచించడం, ఆత్మపరిశీలన చేసుకోవడంతోనే ఈ ఏడాది సరిపోయింది. వృత్తి పరమైన వైఫల్యాలను కూడా తెరచి చూసుకున్నాను. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఏడాది ఎప్పుడూ చేయనన్ని పూజలు, ప్రార్థనలు చేశా. వరాలు, దీవెనల కోసం కాదు. శక్తిని, ప్రశాంతతను ఇవ్వమని దేవుడిని ప్రార్థించా. అన్నీ మనకు అనుకూలంగానే జరగవన్న విషయం ఈ ఏడాది నాకు నేర్పించింది.
మరీ ముఖ్యంగా, ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏంచేయాలో తెలిసింది. నా చేతుల్లో ఉన్నదైతే నేను నియంత్రించగలను. లేనిదాన్ని వదిలేయడం అలవర్చుకున్నాను. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్లాలి. అది విజయాల కోసమే కానవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ముందడుగు వేయడమే పెద్ద విజయం. ప్రతీది పరిపూర్ణం కావడానికి ఎదురుచూస్తూ కూర్చోకూడదు. అలా అని గతాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. నన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తా… నన్ను ప్రభావితం చేసే శక్తిని ద్వేషించను. మీలో కూడా చాలామంది జీవితంలో కష్టాలను ఎదుర్కొని ఉంటారు. మీలాంటి వారి కోసం కూడా నేను ప్రార్థిస్తాను. దేవుళ్లు కొన్నిసార్లు ఆలస్యం చేస్తారేమో కానీ, వారు ఎప్పుడూ మన అభ్యర్థనలను తిరస్కరించరు. శాంతి, ప్రేమ, సంతోషం, శక్తిని కోరుకుంటే వారు ఎప్పుడూ కాదనరు. ఎలాంటి స్వార్థం లేని అంశాలు ఇవే కదా..!’ అంటూ సామ్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.ఇక సమంత ఇటీవలే నటించిన శాకుంతలం బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొట్టింది. ప్రస్తుతం సామ్ ఆశలన్నీ ఖుషీ సినిమాపైనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. వరుణ్ ధావణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను ది ఫ్యామిలీ మ్యాన్ రూపకర్తలు రాజ్&డీకే రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో సామ్ పోలీస్ అధికారిగా కనిపించనుంది.
Also Read..
Karnataka High Court | భారత్‌లో ఫేస్బుక్ సేవలు నిలిపివేస్తాం.. కర్ణాటక హైకోర్టు హెచ్చరిక!
Tamanna-Vijay Varma | తమన్నాతో ప్రేమ విషయం అందుకే రహస్యంగా ఉంచా : విజయ్ వర్మ
Adipurush | ట్విట్టర్ ట్రెండింగ్ లో ‘ఆదిపురుష్’.. ఆల్ ది బెస్ట్ చెప్పిన దేవేంద్ర ఫడణవీస్