వృత్తివిషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తాడని, సమయపాలన అస్సలు ఉండదని, వ్యాయామానికి మాత్రమే ఎక్కువ సమయం కేటాయిస్తారని బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్‌పై గతకొంతకాలంగా ముంబయి మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో సల్మాన్‌ఖాన్ స్పందించారు. సుదీర్ఘ కెరీర్లో ఇప్పటికే వందకుపైగా చిత్రాల్లో నటించానని, వృత్తిపట్ల అంకితభావం లేకుంటే ఇన్ని విజయాలు ఎలా సాధ్యమయ్యేవని ఆయన ప్రశ్నించారు. ‘నా సమకాలీనులెవ్వరూ వంద చిత్రాల్లో నటించలేదు. సెట్‌కి ఆలస్యంగా వచ్చి త్వరగా వెళ్లేవాడినైతే కెరీర్లో ఇంతదూరం వచ్చేవాడిని కాదు. మధ్యాహ్నం పన్నెండుగంటలకు సెట్‌కు వచ్చి అర్ధరాత్రి వెళ్లిపోతాను.
ఉదయం నా వర్కవుట్స్, వ్యాపార సంబంధమైన లావాదేవీలను చూసుకోవాలి కాబట్టి మధ్యాహ్నం షూట్లో జాయిన్ కావడం ఆనవాయితీగా మార్చుకున్నా. ఒక్కసారి నేను సెట్లో అడుగుపెట్టానంటే ఆ రోజు షూట్ పూర్తయ్యేవరకు కనీసం కుర్చీలో కూడా కూర్చోను. షాట్‌గ్యాప్‌లో క్యారవ్యాన్‌లోకి అస్సలు వెళ్లను. ఆన్‌లొకేషన్‌లో అయితే యూనిట్ వాళ్లు వేసిన టెంట్ కిందే నిల్చొని ఉంటాను. ఈ విషయాలను నాతో పనిచేసిన ఎవరిని అడిగినా చెబుతారు. సెట్‌కి ఆలస్యంగా వస్తాడనే కారణాన్ని చూపుతూ నటుడిగా నా వ్యక్తిత్వంపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని సల్మాన్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సల్మాన్‌ఖాన్, రష్మిక మందన్న జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సికందర్’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది.