Salman Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు (Threat) వచ్చాయి. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Gangster Lawrence Bishnoi) పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్ ఖాన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. ఆ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
‘పాట రచయిత (songwriter) ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన పరిస్థితి ఇకపై పాటలు రాయలేని విధంగా ఉంటుంది. సల్మాన్‌కు ధైర్యం ఉంటే వారిని రక్షించుకోవాలి’ అని హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, మూడు రోజుల్లో సల్మాన్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది రెండోసారి.
ఈనెల 5వ తేదీ కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. కృష్ణ జింకను చంపినందుకు గానూ సల్మాన్ ఆలయాన్ని సందర్శించి క్షమాపణలు చెప్పాలని (forgiveness at temple).. లేదంటే రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకునే వ్యక్తి నుంచి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్‌కు సోమవారం ఈ సందేశం పంపారు.
కాగా, సల్మాన్ ఖాన్‌కు ఇటీవలే వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు అక్టోబర్ 17 రాత్రి మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్ ఎవరిది, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. ఈ కేసులో జంషెడ్‌పూర్‌కు 24 ఏళ్ల కూరగాయల అమ్మకందారుడు షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత శుక్రవారం కూడా సల్మాన్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. బెదిరింపులకు పాల్పడింది నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి మహ్మద్ తయ్యబ్‌గా గుర్తించిన పోలీసులు అతడి అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత గత నెల 30వ తేదీన కూడా మరోసారి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. రూ. రెండు కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని ఆయన్ను బెదిరించారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ మెసేజ్ వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఆ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే, అతన్ని చంపేస్తామని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ముంబైలోని వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు భద్రతను పెంచింది.
Also Read..
Vettaiyan | గెట్ రెడీ.. రజినీకాంత్ వెట్టైయాన్ ఓటీటీ ఎంట్రీ
Devara | ఓటీటీలో దేవర సందడి.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే.. ?