Salman Khan | లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) నుంచి వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) భద్రతా వలయంలో ఉన్నారు. సల్మాన్ ఎక్కడికి వెళ్లినా.. ఆయన చుట్టూ భద్రతా సిబ్బందే కనిపిస్తున్నారు. షూటింగ్‌కు సైతం భద్రత మధ్యే వెళ్తున్నట్లు తెలిసింది.
వరుస హత్య బెదిరింపులు రావడంతో సల్మాన్ ఖాన్ ఇప్పట్లో ఎలాంటి షూటింగ్స్కూ హాజరు కాకపోవచ్చంటూ బాలీవుడ్ సర్కిల్లో వార్త చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే, సల్మాన్ వాటన్నింటికీ చెక్ పెడుతూ గురువారం రాత్రి బిగ్ బాస్ షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టినట్లు తెలిసింది. ఇవాళ ‘వీకెండ్ కా వార్’ షూట్ (Bigg Boss shoot) చేయనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి సెట్లోకి అడుగుపెట్టిన సల్మాన్ అక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హౌస్‌లో బస చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
సల్మాన్ షూటింగ్లో పాల్గొనే సమయంలో దాదాపు 60 మంది సెక్యూరిటీ (60 guards) సెట్లో ఉండనున్నట్లు తెలిపింది. నటుడి భద్రతను వారు నిరంతరం పర్యవేక్షించనున్నారు. సల్మాన్ సెట్లో ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వారిని అందులోకి అనుమతించరు. షూట్ కోసం పని చేసే సిబ్బంది సైతం లోపలికి వచ్చే ముందు కచ్చితమైన ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఇక షూట్ పూర్తయ్యే వరకూ లోపలి వ్యక్తులు ఎవరూ బయటకు వెళ్లేందుకు కూడా వీలు ఉండదు.
బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ లిస్ట్‌లో..
1998 కృష్ణ జింక కేసు నుంచి సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోటారు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఇంటి ముందు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్‌లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్‌పై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో కొందరు అనుమానితుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు.
పక్కా ప్లాన్‌తోనే హత్యకు కుట్ర..
ఇక ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తోందని పోలీసులు ఛార్జిషీట్లో ప్రస్తావించారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలోనే కారులో సల్మాన్‌ను హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
పాక్ నుంచి తుపాకులు
నటుడి హత్యకు మోడ్రన్ వెపన్స్ (modern weapons) కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుల ముఠా ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్ ఆయుధాలను వంటి అధునాతన మారణాయుధాలను పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్ ప్రదేశాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది.
Also Read..
YS Jagan | ఏపీలో మాఫియా సామాజ్యం నడుస్తోంది : వైఎస్ జగన్
IND vs NZ 1st Test | తొందరపాటుతో యశస్వీ స్టంపౌట్ .. రోహిత్ హాఫ్ సెంచరీ
Telangana | 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం.. ఓయూ వైస్ ఛాన్సలర్‌గా కుమార్