అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మాఫియా సామ్రాజ్యం (Mafia rule ) నడుస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. మద్యం, ఇసుక పాలసీల్లో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని భయపెడుతున్నారని పేర్కొన్నారు. తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు అడ్డగోలు హామీలు ఇచ్చి, ఇప్పుడు రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందంటున్నారని వెల్లడించారు. మార్పుల పేరుతో స్కాంలకు తెరలేపారని మండిపడ్డారు.
మద్యం (Liquor) టెండర్లలో కుంభకోణానికి తెరతీశారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా లైసెన్స్ ఇవ్వలేదని అన్నారు. వైసీపీ హయాంలో నాసిరకం మద్యం విక్రయించారని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు అదే డిస్టిలరీ నుంచి మద్యం తీసుకుంటూ నాణ్యమైన లిక్కర్ అంటూ ఊదరగొడుతుందని ఆరోపించారు.
ఉచిత ఇసుక (Free Sand) పేరుతో స్టాక్ యార్డులు దోచేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఇసుక పాలసీ పారదర్శకంగా ఉండేదని పేర్కొన్నారు. ఈ టెండర్ నిర్వహించి ప్రభుత్వానికి ప్రతి యేట రూ. 750 కోట్లు ఆదాయం తీసుకురాగా, నేడు ఆదాయం లేకుండా చేశారని వివరించారు. టెండర్లకు కేవలం రెండు రోజులు గడువు ఇచ్చి సొంతవాళ్లకు దోచిపెట్టారని ఆరోపించారు.
ఏపీలో దోచుకో, పంచుకో, తినుకో పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజల ఆశలతో చెలగాటం ఆడారని, అబద్దాలకు రెక్కలు తొడిగారని విమర్శించారు. రూ. 10 వేలు జీతం అంటూ వాలంటీర్లను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 నెలలుగా సూపర్ సిక్స్ జాడే లేదని వెల్లడించారు.