Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు గురించి ముంబయి పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుడికి బంగ్లాదేశ్‌తో సంబంధాలు ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున 2గంటలకు సైఫ్ అలీఖాన్‌పై అతని ఇంట్లోనే దాడి జరిగింది. బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌గా పేర్కొన్నారు పోలీసులు.
నిందితుడు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించాడని.. అతను బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. అతనివద్ద భారత్‌కు చెందిన గుర్తింపు పత్రాలు లేవని డీసీపీ దీక్షిత్ గేదం తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత పేరును విజయ్ దాస్‌గా మార్చుకున్నాడని పేర్కొన్నారు.
ఐదారు నెలల కిందట ముంబయికి వచ్చినట్లు వివరించారు. మొదట నిందితుడు హౌస్‌కీపింగ్ ఏజెన్సీలో పని చేసే వాడని పేర్కొన్నారు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి కోరనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుందన్నారు. నిందితుడిని పోలీసులు శనివారం రాత్రి 2.50గంటలకు థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలోనే కార్మికులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రావడానికి అనేకసార్లు తన పేరును మార్చుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.