సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది అగ్ర కథానాయిక సాయిపల్లవి. ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి సీతగా, రణబీర్‌కపూర్ రాముడిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న తొలిభాగం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘రామాయణ’ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పింది. పాత్రల ఎంపికలో తన ప్రాధాన్యతల గురించి చెబుతూ ‘సినిమాను ఓకే చేసే ముందు కథలో ఎంతటి బలమైన భావోద్వేగాలు ఉన్నాయో ఆలోచిస్తా. అలాగే నా పాత్రతో ప్రేక్షకులు ఎంత వరకు కనెక్ట్ అవుతారోనని విశ్లేషిస్తా. నిజాయితీతో కూడిన వాస్తవిక కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రేక్షకులు నా పాత్రతో కనెక్ట్ కావాలని కోరుకుంటా. నా దృష్టిలో అదే అతిపెద్ద విజయం’ అని సాయిపల్లవి పేర్కొంది.