Sai Pallavi | దక్షిణాదిలో సాయిపల్లవికి అగ్ర హీరోలతో సమానమైన ఇమేజ్ ఉంది. అభిమానగణం కూడా ఎక్కువే. గత ఏడాది ‘అమరన్’ సినిమాలో సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం మూడొందల కోట్లకుపైగా వసూళ్లను సాధించి ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి తన పారితోషికాన్ని భారీగా పెంచిందని తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘తండేల్’తో పాటు బాలీవుడ్లో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.
‘అమరన్’ చిత్రానికి మూడుకోట్ల పారితోషికం అందుకున్న ఆమె..‘తండేల్’కు ఐదు కోట్లు స్వీకరించిందని ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తల్లో నిజానిజాలు ఎలా ఉన్నా సాయిపల్లవి గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఆమెకు రెమ్యునరేషన్ పట్టింపులు అస్సలు ఉండవని చెబుతారు. సినిమాల విషయంలో మంచి కథలు, పాత్రలకే అధిక ప్రాధాన్యం ఇస్తుందని, పారితోషికం విషయంలో డిమాండ్ చేసిన సందర్భాలు లేవన్నది ఇండస్ట్రీ మాట. ‘పడి పడి లేచె మనసు’ సినిమా ఫెయిల్యూర్ కావడంతో ఆమె తన పారితోషికాన్ని కూడా వదులుకుందని అంటారు. సాయిపల్లవి నాగచైతన్యతో కలిసి నటించిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది.