Sai Pallavi | దక్షిణాది సినీరంగంలో సాయిపల్లవి పంథాయే వేరు. గ్లామర్ పాత్రలకు పూర్తి దూరంగా ఉంటుందీ భామ. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ తమిళ సొగసరి ఎలాంటి నాటకీయత లేని సహజమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటుంది. అందుకే ఈ భామకు దక్షిణాదిలో అభిమానగణం ఎక్కువ. ‘ప్రేమమ్’తో మలయాళ సినీరంగంలో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు బాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఇప్పటివరకు మీరు ప్రేమలో పడలేదా? అని అడగ్గా.. మహాభారత ఇతిహాసం తనకు చాలా ఇష్టమని, అందులో అభిమన్యుడి పాత్రను తాను ఎంతగానో ప్రేమిస్తానని చెప్పుకొచ్చింది. ‘గత పదిహేడేండ్లుగా అభిమన్యుడి పాత్ర గురించి ఏదో కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నా. ఆయనకు సంబంధించిన ఏ కథ అయినా నాలో ఆసక్తిని పెంచుతుంది. ఓరకంగా చెప్పాలంటే గత పదేండ్లుగా ఆయన ప్రేమలో ఉన్నా అంటూ నవ్వుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది. సాయిపల్లవి సమాధానం విన్న నెటిజన్లు ఆమెలో హాస్యచతురత కాస్త ఎక్కువేనని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో ‘తండేల్’, తమిళంలో ‘అమరన్’, హిందీలో ‘రామాయణ’ సినిమాలతో బిజీగా ఉంది.