కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్‌కు మహర్దశ మొదలైంది. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించిన ఈ బెంగళూరు భామ.. ప్రస్తుతం తమిళంలో విరివిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. శివకార్తికేయన్‌కు జోడీగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తాను నటించిన ‘మదరాసీ’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు రుక్మిణి వసంత్.
ఇదిలావుంటే.. ‘మదరాసీ’ విడుదల కాకముందే కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ ఈ అందాల భామను వరించింది. తమిళ అగ్ర నటుడు విక్రమ్ కథానాయకుడిగా ‘96’ఫేం ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ చిత్రంలోనూ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.