“రాబిన్‌హుడ్’ చేశాక నటునిగా నామీద నాకు కాన్ఫిడెన్స్ రెట్టింపయ్యింది. సినిమా చూశాక నేను హీరోగా చేసిన రోజులు గుర్తొచ్చాయి. అలాగే ఆడియన్స్‌కి కూడా గుర్తొస్తాయి. చాలా ఎంటైర్టెన్మెంట్గా ఉంటుందీ సినిమా’ అని నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో దేశంలోనే అత్యున్నతమైన సెక్యూరిటీ ఏజెన్సీకి నేను అధినేతను. నా ఏజెన్సీలో పనిచేసేందుకు హీరో వస్తాడు. మా కాంబినేషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. నా టైమింగ్‌ని నితిన్ ఫాలో అవ్వాలి. అతని టైమింగ్‌ని నేను ఫాలో అవ్వాలి. క్యారెక్టర్లు ఇలా డిజైన్ చేయబడ్డాయి. మా మధ్య వెన్నెల కిశోర్. సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి ఎంటైర్టెన్మెంట్ మూవీ చేసి నిజంగా చాలాకాలమైంది. ఈ మధ్యకాలం వందకోట్ల వసూళ్లు దాటిన సినిమాలు చాలా చేశాను. వాటి సరసన ‘రాబిన్‌హుడ్’ కూడా చేరుతుంది’ అని నమ్మకం వ్యక్తం చేశారు.