సినిమారంగంలో రాణించాలనే కోరిక బలంగా ఉన్నా.. ఆ విషయంలో తల్లిదండ్రులు ప్రోత్సహం మాత్రం తెలుగమ్మాయిలకు అరుదే. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే సినిమా రంగం అనేసరికి భూతద్దంలో చూడటం సమాజానికి పరిపాటైపోయింది. యాక్ట్రస్గా రాణించే విషయంలో తెలుగమ్మాయిలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కరువవ్వడానికి అదికూడా ఓ కారణం. ఈ విషయంలో తనది మాత్రం భిన్నమైన అనుభవమని అంటున్నది అచ్చతెలుగు అందం రీతూవర్మ. ‘మా ఇంట్లో అందరూ ఇంజనీర్లూ, డాక్టర్లే. మా అమ్మ అయితే.. సొంతంగా స్కూల్ రన్ చేస్తున్నారు. నాకేమో చిన్నప్పట్నుంచీ యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్. ఈ విషయం ఇంట్లో చెప్పినప్పుడు అంతా నన్ను విచిత్రంగా చూశారు.
కానీ అమ్మ మాత్రం ‘వెళ్లు.. ఓ ప్రయత్నం చేయ్’ అంటూ ప్రోత్సహించారు. అమ్మకు నాపై ఉన్న నమ్మకం అలాంటిది. కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు చేస్తున్నప్పుడు కూడా అమ్మ నన్ను తప్పు పట్టలేదు. నిజంగా ఆమె సహకారం వల్లే ఈ రోజు హీరోయిన్ స్థాయికి చేరుకోగలిగా. అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్నా. ఇండస్ట్రీలో జరిగే ప్రతి విషయాన్నీ అమ్మతో పంచుకుంటా. సమస్యలెదురైతే వాటిని కూడా అమ్మతోనే షేర్ చేసుకుంటా. వాటికి వెంటనే అమ్మ పరిష్కారం చెప్పేస్తుంది. అమ్మ వృత్తి రీత్యా ఎంత బిజీగా ఉన్నా.. నాకు మాత్రం ఏ లోటూ రానివ్వదు.’ అని చెప్పుకొచ్చింది అందాలభామ రీతూవర్మ.