రివ్యూ: కాంతారా
తారాగణం: రిషబ్‌శెట్టి, కిషోర్‌కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమిగౌడ, ప్రమోద్‌శెట్టి తదితరులు
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్
సంగీతం: అజనీష్ లోకనాథ్
నిర్మాత: విజయ్ కిరగందూర్
దర్శకత్వం: రిషబ్ శెట్టి
తెలుగు డిస్ట్రిబ్యూషన్: గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్
కొన్నేళ్ల క్రితం సినీ వ్యాపారపరంగా చిన్న పరిశ్రమగా ముద్రపడ్డ కన్నడ చిత్రసీమ క్రమంగా తన పరిధుల్ని విస్తరించుకుంటున్నది. పాన్ ఇండియా కథాంశాలతో దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతున్నది. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలు అందుకు నాంది పలికాయి. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ‘కాంతారా’ కన్నడనాట సంచలనాల్ని సృష్టిస్తున్నది. సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చింది. ఇటీవకాలంలో కన్నడ చిత్రసీమలో విమర్శకుల ప్రశంసలందుకుంటూ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న ‘కాంతారా’ తెలుగు ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..
కథేమిటంటే:
18వ శతాబ్దంలో ఓ రాజుకు మనశ్శాంతికి కరువవుతుంది. గురువుల సలహా మేరకు మనశ్శాంతిని వెతుక్కుంటూ దేశాటన చేస్తాడు. ఈ క్రమంలో అతనికి అడవిలోని ఓ గూడెం వద్ద రాయి రూపంలో దేవుడు కనిపిస్తాడు. ఆ దైవాన్ని దర్శించుకోగానే రాజుకు ప్రశాంతత చేకూరుతుంది. ఆ దేవుణ్ణి తనకు ఇచ్చేస్తే గూడెం జనాలకు తాను భూమినిస్తానని రాజు ఆశచూపుతాడు. అయితే అక్కడే ఉన్న ఓ గూడెం వాసుణ్ణి ఆవహించిన దేవుడు తన అరుపు ఎంతవరకు వినిపిస్తే అంతవరకు రాజ్యాన్ని ఏలుకోమంటాడు. తరాలు మారుతాయి. కథ 1970లోకి ప్రవేశిస్తుంది. ఓ రోజు రాజు వారసుడు అక్కడ సంప్రదాయబద్దంగా జరిగే కోలం ఉత్సవంలో దేవుని వేషం కట్టిన వ్యక్తిని దూషిస్తాడు. ఆ అటవీ భూమి ఒకప్పుడు తన పూర్వీకులది కాబట్టి తనకే చెందాలని వాదిస్తాడు. నిజంగా దేవుడుంటే చూపించమని హేళన చేస్తాడు. అప్పుడు దేవుడి ఆవాహనలో ఉన్న వ్యక్తి అడవిలోకి వెళ్లి అంతర్థానమవుతాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత రాజు వారసుడు కోర్టు మెట్ల మీద రక్తం కక్కుకొని మరణిస్తాడు. ఆ తర్వాత కథ 90దశకంలోకి ప్రవేశిస్తుంది. రాజు వారసత్వ పరంపరకు చెందిన దొర (అచ్యుత్) అడవిలో గూడెం ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతుంటాడు. అదే గూడానికి చెందిన శివ (రిషబ్‌శెట్టి) అక్కడి ప్రజలకు చేదోడువాదోడుగా ఉంటూ కష్టాల్ని తీర్చుతుంటాడు. అదే సమయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ అటవీ భూముల్లో అన్యాయంగా గూడెం వెలిసిందని వాటికి హద్దులు గీసి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తుంటాడు. వాటిని శివ ప్రతిఘటిస్తుంటాడు. ఈ నేపథ్యంలో శివపై హత్యాయత్న నేరం మోపి జైలుకు పంపిస్తారు. అదే సమయంలో కోలం ఉత్సవంలో దేవుడి వేషం కట్టే శివ తమ్ముడు గురువా ఓ రోజు హత్యకు గురవుతాడు. ఇంతకు శివ తమ్ముడు గురువాను హత్య చేసిందెవరు? ఫారెస్ట్ ఆఫీసర్ కిషోర్‌కుమార్, శివ మధ్య పోరు ఎలాంటి పరిణామాలకు దారితీసింది? గూడెం ప్రజలతో సామరస్యంగా ఉండే దొర తాలూకు వికృతరూపం ఏమిటి? వరహా రూపంలో ఉండే విష్ణుమూర్తి అవతారం తరచూ శివను ఎందుకు కలవరపెడుతుంటుంది? చివరకు గూడాన్ని శివ దుర్మార్గుల బారి నుంచి ఎలా రక్షించాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ..
కథా విశ్లేషణ:
దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని, తరాలు మారిన ధర్మమే గెలుస్తుందనే పాయింట్ మీద ఈ కథను అల్లుకున్నారు. ఇందులో దైవిక అంశాలు, జానపద సంస్కృతి , భూమిపుత్రుల హక్కులు, అటవీ గూడెం వారి జీవన విధాన ఆవిష్కరణతో అనేక పార్శాల్లో కథను నడిపించడం ఆసక్తినిరేకెత్తిస్తుంది. అనగనగా ఓ రాజు అంటూ చందమామ కథగా మొదలయ్యే ఈ సినిమాలో దర్శకుడు, హీరో రిషబ్‌శెట్టి అనేక తాత్విక, సాంస్కృతిక, ప్రతిఘటన అంశాల్ని చర్చించారు. కోలం అనే దక్షిణ కన్నడ ఆచార వ్యవహారం, వరాహ రూపంలోని విష్ణుమూర్తి వంటి అంశాలతో కథను డివోషనల్ ఫీల్‌తో నడిపించిన విధానం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ప్రథమార్థం మొత్తం ఫారెస్ట్ అధికారి కిషోర్, శివ మధ్య జరిగే పోరాటం, ఎత్తుకుపైఎత్తులతో సాగింది. శివ జైలు కెళ్లడంతో కథలో కీలక ములుపు తీసుకుంటుంది. ద్వితీయార్థంలో కథ కాస్త స్లోఫేస్లో సాగినట్లు కనిపించినా..శివ తమ్ముడు గురువా హత్యతో కథల వేగం పెరుగుతుంది. అక్కడి నుంచి పతాకస్థాయి భావోద్వేగాల్ని పండిస్తూ..ైక్లెమాక్స్‌లో శివ విశ్వరూప నట ప్రదర్శనతో ముగుస్తుంది.
కన్నడంలో ‘కాంతారా’ అంటే అడవి అని అర్థం. సినిమా ఆసాంతం అటవీ నేపథ్యంలో నడుస్తుంది. దక్షిణ కన్నడ తాలూకు సంప్రదాయాల్ని, అక్కడి గ్రామీణ జీవన విధానాన్ని అత్యంత సహజంగా ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. సినిమా ప్రతి ఫ్రేమ్‌లో విజువల్ గ్రాండ్‌నెస్ కనిపించింది. కోలం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. దర్శకుడు, హీరో రిషబ్‌శెట్టి ఈ కథను కోలం అనే జానపద దైవిక కాన్సెప్ట్ మీద రాసుకున్నారు. ఒకప్పుడు ఇచ్చేసిన దానిని తిరిగి కోరుకోవద్దని..దేవుడి దగ్గరి నుంచి ఏం తీసుకోవాలని ప్రయత్నించినా క్షేత్రపాలకుడి రూపంలో ఉన్న దైవం శిక్షిస్తుందని తాత్విక పాయింట్ మీద ఈ కథను నడిపించిన విధానం హైలైట్‌గా అనిపిస్తుంది. ద్వితీయార్థంలోని చివర అర్థగంట సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. విష్ణురూపాన్ని ఆవాహన చేసుకొని క్లెమాక్స్‌లో రిషబ్‌శెట్టి చేసిన అభినయానికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది. కన్నడంలో శెట్టి త్రయంగా పేరున్న రిషబ్‌శెట్టి, రక్షిత్‌శెట్టి, రాజ్ బి శెట్టి వైవిధ్యమైన కథలతో కన్నడ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కన్నడ ప్రాంతీయతను ఆవిష్కరించే కథలతో శాండల్‌వుడ్‌కు కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నారు. అదే కోవలో ‘కాంతార’ చిత్రాన్ని ఓ వైవిధ్యమైన అనుభూతిని కలిగించే విధంగా దర్శకుడు రిషబ్‌శెట్టి తీర్చిదిద్దారు.
నటీనటుల పనితీరు:
నిస్సందేహంగా ఇది రిషబ్‌శెట్టి సినిమాయేనని చెప్పొచ్చు. అద్భుతమైన దర్శకత్వంలో పాటు అబ్బురపరిచే నటనతో సినిమా ఆసాంతం తన భుజస్కంధాలపై నడిపించాడు. ైక్లెమాక్స్‌లో అతని అద్భుతాభినయం గుర్తుండిపోతుంది. మిగతా పాత్రల్లో ఫారెస్ట్ ఆఫీసర్‌గా కిషోర్‌కుమార్, దొరగా ప్రతినాయక పాత్రలో అచ్యుత్ తమదైన అభినయంతో మెప్పించారు. కథానాయిక సప్తమిగౌడ నటన బాగుంది. హోంబలే ఫిల్మ్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఆసాంతం విజవల్ ఫీస్ట్‌లా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. కోలం నేపథ్యంలో వచ్చే పాటలు చక్కటి సంప్రదాయక ఫీల్‌తో ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా, హీరోగా రిషబ్‌శెట్టి ఈ సినిమాకు పరిపూర్ణంగా న్యాయం చేశాడు.
తీర్పు:
అటవీ, ప్రకృతి, దైవిక అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథ తప్పకుండా ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. విభిన్న కథా చిత్రాన్ని చూశామనే అనుభూతిని మిగులుస్తుంది.
రేటింగ్: 3.5/5
Read Also:
Ponniyin Selvan-1 | ‘విక్రమ్’ రికార్డును బ్రేక్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్’..!
SDT15 | ఆసక్తి రేకెత్తిస్తున్న సాయిధరమ్‌తేజ్ కొత్త సినిమా పోస్టర్
Naga Chaitanya | నాగచైతన్య తదుపరి సినిమా ఆ దర్శకుడితోనేనా?
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు దర్శకుడిగా ముందుగా సుకుమార్‌ను అనుకున్నారా..!
Oridevuda Movie | ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పాన్ ఇండియా హీరో..!