Rishab Shetty | కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’తో దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.. తన తోటి నటీనటులైన రుక్మిణి వసంత్, రాజ్ బి శెట్టిలను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘సప్త సాగరదాచే ఎల్లో’ ఫేమ్ నటి రుక్మిణి వసంత్, అలాగే తన అత్యంత ఆప్తమిత్రుడు, నటుడు-దర్శకుడు అయిన రాజ్ బి శెట్టిలను అన్‌ఫాలో చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరి మధ్య ఏవైనా మనస్పర్థలు లేదా విభేదాలు వచ్చాయా లేక ఇది కేవలం పొరపాటున జరిగిందా అనే విషయాలపై సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బి శెట్టిలను ‘శెట్టి త్రయం’ అని పిలుస్తారు. వీరు ముగ్గురూ కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించి ఇండస్ట్రీ రూపురేఖలను మార్చారు. ముఖ్యంగా రాజ్ బి శెట్టితో రిషబ్‌కు ఉన్న మంచి స్నేహబంధం అందరికీ తెలిసిందే కాబట్టి, ఇప్పుడు రిషబ్ అతడిని అన్‌ఫాలో చేయడం అభిమానులకు మింగుడుపడటం లేదు. మరోవైపు నటి రుక్మిణి వసంత్ కూడా వీరి కాంపౌండ్ నుంచి వచ్చిన ‘సప్త సాగరదాచే ఎల్లో’, ‘కాంతార చాఫ్టర్ 1’ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెను కూడా ఎందుకు అన్‌ఫాలో చేశారనే దానిపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై రిషబ్ శెట్టి గానీ, ఇటు రాజ్ బి శెట్టి, రుక్మిణి వసంత్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.