Renukaswamy Case | రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను సమర్పించింది. బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టుకు న్యాయసేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి వరదరాజ ఈ సమగ్ర నివేదికను అందజేశారు. దర్శన్‌కు జైలు నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని సౌకర్యాలు అందుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అరికాళ్లకు ఫంగస్ సోకినట్లు దర్శన్ చేసిన ఆరోపణలను చర్మవ్యాధుల నిపుణురాలు డాక్టర్ జ్యోతిబాయి నిర్ధారించిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు. అలాగే దర్శన్, పవిత్రాగౌడతో సహా ఇతరులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను న్యాయస్థానం అక్టోబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.
కమిటీ ఇచ్చిన నివేదికలో.. విచారణ ఖైదీలకు పరుపు, దిండు వంటి సౌకర్యాలు కల్పించడం జైలు నిబంధనల ప్రకారం సాధ్యం కాదని తెలిపారు. అంతేగాకుండా దర్శన్ ఉంటున్న బ్యారక్‌లో ఇండియన్‌తో పాటు వెస్ట్రన్ బాత్రుమ్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోజూ ఒక గంట పాటు ఎండలో నడవడానికి అవకాశం ఇచ్చినట్లు తెలిపిన కమిటీ దర్శన్ వాకింగ్ సమయంలో ఇతర ఖైదీలు కేకలు వేయడం, అతనిని కలవడానికి ప్రయత్నించడం జరుగుతోందని పేర్కొంది. అలాగే దర్శన్‌ని బయట వాకింగ్‌కు అనుమతిస్తే జైలు సమీపంలోని అపార్ట్మెంట్ల నుంచి ఫోటోలు, వీడియోలు తీసే అవకాశం ఉందని తెలిపారు. జైలులో ఒకే హాల్లో టీవీ అందుబాటులో ఉంది, కానీ బ్యారక్‌లో వ్యక్తిగత టీవీ అమర్చడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. బంధుమిత్రులతో ఫోన్లో మాట్లాడిన కాల్స్‌ను రికార్డ్ చేస్తున్నారన్న దర్శన్ ఆరోపణలపై అది జైలు నియమమని అధికారులు తెలిపారు. దర్శన్‌కు అరికాళ్లలో ఫంగస్ వల్ల నొప్పులు వస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వైద్యులు వారానికి రెండుసార్లు అతనిని పరిశీలిస్తున్నారు.