Renu Desai | ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో కుక్కల అంశంపై చేసిన వ్యాఖ్యలు ఊహించని రీతిలో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ అంశం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక వర్గం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతుంటే, మరో వర్గం మాత్రం ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేస్తున్న తీరుపై రేణు దేశాయ్ తాజాగా మరోసారి స్పందించారు.గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో 13 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసిన రేణు దేశాయ్, ఈ వివాదంపై క్లారిటీగా మాట్లాడారు.
ప్రెస్మీట్లో తాను దాదాపు అరగంట పాటు మాట్లాడితే, అందులో నుంచి కొందరు కావాలనే చిన్న చిన్న క్లిప్పింగ్స్‌ను తీసుకుని వేరే అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటల అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి, సందర్భం లేకుండా వైరల్ చేయడం వల్లే ఈ వివాదం ఇంత పెద్దదైందని తెలిపారు. తాను ఎప్పుడూ జంతువుల పట్ల ద్వేషంతో మాట్లాడలేదని, మనుషులైనా జంతువులైనా అందరూ బాగుండాలన్నదే తన అభిప్రాయమని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో వీధి కుక్కల వల్ల ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాత్రమే ప్రస్తావించానని, అంతేగానీ కుక్కలను హింసించాలి లేదా చంపేయాలన్న మాట తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. సమస్యలను మానవీయంగా, శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నదే తన ఉద్దేశమని వెల్లడించారు.
ఈ సందర్భంగా జీవితం తాత్కాలికమనే అంశాన్ని ప్రస్తావించిన రేణు దేశాయ్, కుక్కలు, పిల్లులు, కోతులు మాత్రమే కాదు… మనుషుల జీవితమూ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందేనని, అలాంటి సమయంలో ద్వేషం, ఆగ్రహంతో కాకుండా సహజీవన భావనతో జీవించాలని సూచించారు. ఈ మాటలు చెబుతూనే ఆమె భావోద్వేగానికి లోనవడం కూడా గమనార్హం. అలాగే ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమాను ఉదాహరణగా తీసుకుని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. “ఇదే కలియుగం” అంటూ, మనిషి మనిషిగా ఉండాల్సిన విలువలను గుర్తు చేసుకోవాలని సూచించారు. రేణు దేశాయ్ చేసిన ఈ తాజా వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది.