Renu Desai | సినీ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ తనదైన గుర్తింపు, మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇటీవల సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చిన ఆమె, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. సినిమాలతో పాటు సామాజిక సమస్యలపై కూడా తన గళాన్ని వినిపిస్తూ, సోషల్ మీడియాలో చురుకుగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు, ఎదుర్కొన్న కష్టాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ముఖ్యంగా, ఆన్లైన్లో వ్యక్తిగత గోప్యత కాపాడుకోవడం ఎంత కష్టమైందో వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్, విమర్శలు తనపై ప్రభావం చూపాయని, అందుకే కొన్నిసార్లు మనుషులంటే విరక్తి కలిగిందని చెప్పారు.
ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే, గుండె సంబంధిత సమస్యల కారణంగా తాను “బీటా-బ్లాకర్స్” అనే మందులు వాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మందులు శరీర జీవక్రియను మందగింపజేసి, బరువు పెరగడానికి కారణమవుతాయని ఆమె వివరించారు. ఆ సమయంలో ఆ మందులు వాడక తప్పలేదని, అది అత్యవసర పరిస్థితి అని స్పష్టం చేశారు. ఈ మందుల ప్రభావంతో తన శరీరం ఉబ్బిపోయిందని, గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అది స్పష్టంగా కనిపించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత సహజ వైద్య విధానాల వైపు మళ్లి, చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ప్రక్రియలన్నీ తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ, ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపారు.
అలాగే, తన జీవితంలో ఎదురైన మరో ప్రమాదకర పరిస్థితిని కూడా రేణూ దేశాయ్ పంచుకున్నారు. అపెండిక్స్ సమస్యతో చివరి నిమిషంలో ఆసుపత్రికి చేరుకున్నానని, కొన్ని గంటలు ఆలస్యమైతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేదని వైద్యులు చెప్పారని వెల్లడించారు. తీవ్ర నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన తర్వాత పరీక్షలు చేయగా, తీవ్రమైన అపెండిసైటిస్ ఉందని, అది సెప్సిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగతంగా ఎదుర్కొన్న కష్టాలను ధైర్యంగా బయటపెట్టిన రేణూ దేశాయ్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.