ఆయన ఏనాడూ బడి ముఖం చూడలేదు. తన కళ్లముందున్న ప్రపంచాన్నే ఓ పాఠశాలగా భావించాడు. ప్రకృతిని అమ్మలా ఆరాధించాడు. మాయమైపోతున్న మనిషికోసం, మనసు తడి కోసం ఆజన్మాంతం తపించాడు. అక్షరజ్ఞానం లేకపోయినా ఏకసంథాగ్రాహియై పురాణాలు, ఇతిహాసాల తాలూకు తాత్విక లోతుల్ని తెలుసుకున్నాడు. ఒకప్పటి సాధారణ పశువుల కాపరియైన అందె ఎల్లయ్య సాహితీస్రష్ట అందెశ్రీగా ఎదిగిన వైనం అనితరసాధ్యం. ఓ స్ఫూర్తిదాయక ప్రస్థానం. ఓరుగల్లు మట్టిలో పుట్టిన ఈ పాటల మాలి తెలుగు సినీ సాహిత్యంపై చెరగని ముద్రవేశారు. రాసినవి కొద్ది పాటలే అయినా అవి రగిలించిన చైతన్యం అనంతం.
సినీరంగంలో దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి అందెశ్రీని ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఊరు మనదిరా’ ‘ఎర్రసముద్రం’ ‘వేగు చుక్కలు’ చిత్రాల్లో అందెశ్రీ పాటలు రాశారు. ‘ఎర్రసముద్రం’ చిత్రంలో ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..’ గీతం విశేషప్రజాదరణ పొందింది. విలుప్తమైపోతున్న మానవ సంబంధాలను పునరుజ్జీవింపజేసుకోవాలనే ఆర్తితో రాసిన ఈ పాట ప్రేక్షకుల హృదయాలను తట్టిలేపింది. ప్రపంచీకరణ సందర్భంలో మానవీయ విలువల ఆవశ్యకతను చాటిచెప్పిందీ గీతం.
ఈ పాట పాఠ్యాంశంగానూ మారడం విశేషం. ‘ఈ పాట పుట్టడానికి ప్రత్యేకమైన సందర్భమేమీ లేదు. సాధారణ కవుల పరంపరలో కొట్టుకుపోవద్దనుకొని, కొత్తగా ఉండాలని ఈ పాట రాశాను. మాయమైపోతున్న మనిషి కోసమే నా కవితాగమనం. ఆత్మగౌరవంతో కూడిన ధిక్కారం ఎంతున్నా ఫర్వాలేదు. కానీ అజ్ఞానంతో కూడుకున్న అహంకారం అరువంత ఉన్నా పతనం తప్పదు’ అంటూ ఈ పాట గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అందెశ్రీ.
‘గంగ’ చిత్రంలో ‘వెళ్లిపోతున్నావా..’ అనే గీతానికి 2006లో ఉత్తమ గీతరచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు అందెశ్రీ. స్వీయనిర్మాణ దర్శకత్వంలో యలమంచిలి శేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయనే అందెశ్రీని సినీరంగానికి పరిచయం చేశారు. ‘వేగుచుక్కలు’ చిత్రంలో అందెశ్రీ రాసిన ‘కొమ్మచెక్కితే బొమ్మరా..కొలిచి మొక్కితే అమ్మరా.. ఆదికే ఇది పాదురా.. కాదంటే ఏదీ లేదురా’ అనే పాట దేవుడు, ప్రకృతి, మానవ మనుగడ తాలూకు పరమార్థాన్ని ఆవిష్కరిస్తూ అజరామర గీతంగా నిలిచిపోయింది. జానపదుల జీవన విధానం, గ్రామ దేవతల ప్రాశస్త్యాన్ని ఈ పాటలో అందంగా చిత్రీకరించాడు. అలాగే.. ‘జైబోలో తెలంగాణ’ చిత్రంలోని ‘జనజాతరలో మనగీతం.. జయకేతనమై ఎగరాలి.. ఝంఝ మారుత జన నినాదమై జేగంటలు మోగించాలి’ అనే గీతం ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించింది. యువతలో ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తూ ముందుకు నడిపించింది. ‘ఊరు మనదిరా’చిత్రంలోని ‘చూడా చక్కని తల్లి..చుక్కల్లో జాబిల్లి’ పాట కూడా బహుళప్రజాదరణ సొంతం చేసుకుంది.
వీటితో పాటు ‘పల్లెనీకు వందనాలమ్మో’ ఓరుగల్లు చారిత్రక వైభవాన్ని వర్ణిస్తూ రాసిన ‘గలగల గజ్జెలబండి ఘల్లు చూడు ఓరుగల్ల్లూ చూడు..నాటి కాకతీయులు ఏలినట్టి ఖిల్లా చూడు’ పాటలు కూడా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘బతుకమ్మ’ చిత్రానికి అందెశ్రీ మాటలు కూడా ప్రేక్షకుల్ని మెప్పించాయి. అందెశ్రీ సినీ గీతాల్లో మానన సంబంధాల పట్ల అనురక్తి, పల్లె..ప్రకృతిపట్ల అవ్యాజమైన ప్రేమ, సమాజంలోని అన్యాయాల పట్ల ధిక్కార స్వరం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది.
ప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు. యావత్ తెలుగుజాతికి తీరని లోటు. నా సినిమాల్లో అమోఘమైన పాటల్ని అందించి వాటి విజయానికి అందెశ్రీ ఎంతగానో దోహదం చేశారు. ‘ఎర్రసముద్రం’ చిత్రంలోని ‘మాయమైపోతున్నడమ్మ..’ పాట పాఠ్యపుస్తకాల్లో ముద్రించబడింది. అది ఆ పాట గొప్పదనం. ‘జయజయహే తెలంగాణ..’ గీతంతో ఆయన జన్మధన్యం చేసుకున్నారు. ఎన్నో గొప్ప పాటలు అందించిన అందెశ్రీ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా’
– ఆర్.నారాయణమూర్తి