‘థగ్‌లైఫ్’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామనే బెదిరింపులు చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ సినిమా విషయంలో కన్నడ సంఘాల దౌర్జన్యపూరిత వైఖరిని సుప్రీం తప్పుబట్టింది. థియేటర్లలో ఏ చిత్రాలను ప్రదర్శించాలో నిర్ణయించే అధికారం ఆయా సంఘాలకు లేదని స్పష్టం చేసింది.
చిత్ర కథానాయకుడు కమల్‌హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ‘థగ్‌లైఫ్’ రిలీజ్‌ను అడ్డుకుంటామని కన్నడ రక్షణ వేదికతో పాటు పలు ప్రజా సంఘాలు హెచ్చరించాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ సైతం విడుదలను ఆపివేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక హైకోర్టులో కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా తీర్పురావడంతో చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. బెదిరింపుల ఆధారంగా చిత్రాన్ని అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. కమల్‌హాసన్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం ప్రశ్నించింది. ‘ఎవరైనా వ్యాఖ్యలు చేసినప్పుడు దానిని మరో మాటతో కౌంటర్ చేసే స్వేచ్ఛ తీసుకోవచ్చు కానీ థియేటర్లను తగలబెడతామని హెచ్చరించే అధికారం ఎవరికీ లేదు.
కన్నడ ప్రజలకు కమల్‌హాసన్ మాటలను ఖండించే స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో ప్రాథమిక హక్కులకు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత సినిమాను విడుదల చేయాల్సిందే. దానిని చూడాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకునే అధికారం ప్రజలకు ఉంటుంది.’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.