ప్రస్తుతం బాలీవుడ్ చూపంతా.. దక్షిణాదిపైనే ఉన్నదని అంటున్నది నటి రెజీనా కసాండ్రా. ఒకప్పుడు తమను చిన్నచూపు చూసినవారే.. ఇప్పుడు అడిగిమరీ అవకాశాలు ఇస్తున్నారని చెబుతున్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీ చిత్రసీమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇంతకుముందు సౌత్ – నార్త్ సినిమాల మధ్య స్పష్టమైన విభజన కనిపించేది. దక్షిణాది తారలకు బాలీవుడ్లో అవకాశాలు దొరకడం చాలా కష్టంగా ఉండేది. సౌతిండియన్స్ అంటే.. సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవాళ్లు కాదు. కానీ, కరోనా మహమ్మారి తర్వాత హిందీ పరిశ్రమలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు బాలీవుడ్లో దక్షిణాది నటుల ప్రవాహం పెరుగుతున్నది. బీటౌన్ దర్శకనిర్మాతలు కూడా దక్షిణాది స్టార్డమ్ను అంగీకరిస్తున్నారు. హిందీ చిత్రాలలోకి వారికీ ఆహ్వానం పలుకుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే.. తమ సినిమాలకు మరింత బలం చేకూర్చడానికి వాళ్లకు దక్షిణాది తారల అవసరం ఏర్పడుతున్నది’ అంటూ చెప్పుకొచ్చింది రెజీనా. అయితే, ఉత్తరాది-దక్షిణాది మధ్య భాషే ప్రధాన అడ్డంకిగా ఉండేదనీ, తన విషయంలో ఎప్పుడూ ఆ ఇబ్బంది ఎదురుకాలేదనీ చెప్పింది. ఇప్పుడు అనేక దక్షిణ భారతీయ చిత్రాలు.. ఉత్తరాదిలోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తున్నాయనీ, అక్కడి ప్రేక్షకులు మనకు బ్రహ్మరథం పడుతున్నారనీ వెల్లడించింది. తాను కొంచెం ఉత్తరాది అమ్మాయిలాగే కనిపిస్తుండటం వల్ల బాలీవుడ్లో ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదని చెప్పుకొచ్చింది. రెజీనా ప్రస్తుతం తమిళ స్టార్ అజిత్ హీరోగా వస్తున్న ‘విదాముయార్చి’లో నటిస్తున్నది. మరో కీలకపాత్ర పోషిస్తున్న అర్జున్ సర్జాకు జోడిగా కనిపించనున్నది.