అగ్ర హీరో రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. రచయిత భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్ని మేకర్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను మంగళవారం విడుదల చేశారు.
‘ఓలే ఓలే గుంటా.. నీ అయ్య కాడ ఉంటా.. నీయమ్మ కాడ తింటా.. నీ ఒళ్లొకొచ్చీ పంటా..’ అంటూ సాగే ఈ ఊరమాస్ గీతాన్ని భాస్కర్ యాదవ్ రాయగా, భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. రోహిణి సోరట్ ఆలపించారు. థియేటర్లలో ప్రేక్షకులతో సెప్పులు వేయించేలా మంచి మాస్ బీట్తో ఈ పాట సాగింది.
రవితేజ, శ్రీలీల జోడి ఈ పాటతో మాస్‌ని మరోసారి ఆకట్టుకుంటుందని, ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరోస్థాయిలో నిలబెట్టారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన, కెమెరా: విధు అయ్యన్న, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్.