అగ్ర హీరో రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న మాస్ ఎంటైర్టెనర్ ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ చెబుతున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచారం వేగవంతం చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఈ సినిమా గురించి ముచ్చటించింది. ఇందులో తాను పోషించిన ఆర్పీఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి రవితేజ మాట్లాడుతూ ‘నా కెరీర్లోనే భిన్నమైన పాత్ర ఇది. భాను భోగవరపు ప్రతిభ గల దర్శకుడు. సన్నివేశాన్ని చిత్రీకరించడంలో తనది భిన్నమైన శైలి. భీమ్స్ మరోసారి చెలరేగిపోయారు.
అద్భుతమైన సంగీతాన్నందించారు. మాస్, వినోదం అంశాలతోపాటు కుటుంబ భావోద్వేగాలతో నిండివున్న కథ ఇది’ అని రవితేజ చెప్పారు. అత్యంత ఆహ్లాదకరమైన సహనటుల్లో రవితేజ ఒకరని, ఆయనతో నటించడం ఎప్పటికీ కొత్తగానే ఉంటుందని, ఇందులో తాను సైన్స్ టీచర్‌గా కనిపిస్తానని, శ్రీకాకుళం యాసలో ఉల్లాసంగా కనిపించే పల్లెటూరి అమ్మాయి పాత్ర తనదని శ్రీలీల తెలిపారు. ప్రారంభం నుంచే తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా సహకరించిన రవితేజకు దర్శకుడు భాను భోగవరపు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన, కెమెరా: విధు అయ్యన్న, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.