Ravi Teja | వరుస పరాజయాలతో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న మాస్ మహారాజ్ రవితేజ, సంక్రాంతికి విడుదలైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. భారీ విజయం కాకపోయినా, అభిమానుల్లో నమ్మకం తిరిగి తెచ్చిన సినిమాగా అది నిలిచింది. ఇదే ఊపుతో, రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ కొత్త సినిమాకు ‘ఇరుముడి’ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌నే సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది.
ఫస్ట్ లుక్‌లో అయ్యప్ప దీక్షలో ఉన్న రవితేజ, నెత్తిన ఇరుముడి పెట్టుకుని ఓ చిన్నారిని ఎత్తుకున్న రూపంలో కనిపించారు. ఇప్పటివరకు మాస్, యాక్షన్, కామెడీ పాత్రలతో అలరించిన రవితేజను ఈ విధంగా పూర్తిగా భిన్నమైన అవతారంలో చూడడం అభిమానులకు సర్ప్రైజ్గా మారింది. ఈ లుక్ చూసిన వెంటనే “ఇది మామూలు సినిమా కాదు” అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది.అయితే సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే, ఇది రీమేక్ అయి ఉండొచ్చనే చర్చ కూడా మొదలైంది. మలయాళంలో 2022లో విడుదలైన ‘మాలికాపురం’ సినిమాలో అయ్యప్ప దీక్ష, చిన్నారులు, శబరిమల యాత్ర నేపథ్యం ఉండటంతో—‘ఇరుముడి’ కూడా అదే కథ ఆధారమా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, శివ నిర్వాణ హారర్ జానర్లో రవితేజతో సినిమా చేస్తున్నాడన్న పాత వార్తలని బట్టి, ఇది మలయాళంలో వచ్చిన ‘కుమారి’ సినిమా రీమేక్ అయి ఉండొచ్చనే వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే ‘ఇరుముడి’ పూర్తిగా ఫ్రెష్ ట్రీట్‌గా ఉండబోతోంది. అయ్యప్ప దీక్ష అనే ఆధ్యాత్మిక నేపథ్యానికి, హారర్ ఫాంటసీ టచ్‌ను జోడించి, తండ్రి–కూతురు ఎమోషన్‌ను కథలో ప్రధానంగా నిలబెట్టి శివ నిర్వాణ ఈ సినిమాను సరికొత్తగా డిజైన్ చేస్తున్నారట. అందుకే ఇది నేరుగా రీమేక్ కాకుండా, కొత్త కథగా ప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాపై రవితేజతో పాటు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కూడా సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని వారు హింట్ ఇచ్చారు. హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అన్ని అనుకున్నట్టే జరిగితే, ‘ఇరుముడి’ 2026లోనే విడుదల కానుంది.