Ravi Teja | ఇటీవలే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సుమారు 1.9కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక లగ్జరీ వాహనం టొయోటా వెల్‌ఫైర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ.4.70లక్షలతో టీఎస్09 జీబీ1111 ఫ్యాన్సీ నంబర్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. తాజాగా లగ్జరీ కారు కొన్న వారి జాబితాలో రవితేజ (Ravi Teja) కూడా చేరిపోయాడు. తాజా అప్డేట్ ప్రకారం రవితేజ బ్రాండెడ్ చైనీస్ ఆటోమేకర్ BYD Atto 3 model (ఎలక్ట్రిక్ వెహికిల్) ను కొనుగోలు చేశాడు. ఈ కారు మార్కెట్ ధర రూ.35 లక్షలు.
రవితేజ ఈ కారు కోసం ప్రత్యేకమైన లైసెన్స్ ప్లేట్ పొందేందుకు ఆన్లైన్ వేలంలో కూడా పాల్గొనడం విశేషం. ఆన్లైన్ వేలంలో ఫైనల్‌గా రూ.17,628 చెల్లించి 2628 నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నాడు. వేలం తర్వాత టీఎస్09 జీబీ 2628 నంబర్‌ను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ మేరకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన రవితేజ ఫొటో, డిజిటల్ సంతకంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. రవితేజ లాంటి సెలబ్రిటీ ఎకో ఫ్రెండ్లీ వాహనాల ప్రాధాన్యతను తెలియజేస్తూ.. కారు కొనుగోలు చేసినందుకు చాలా మంది ప్రశంసిస్తున్నారు.
క్రాక్ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా అయిపోయాడు రవితేజ. ఇటీవలే రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్ రావులో నటిస్తున్నాడు రవితేజ.
Raviteja1