రవితేజ హీరోగా రూపొందిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు కె.ఎస్.రవీంద్ర(బాబీ). చిరంజీవితో ఆయన చేసిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు బాబీ. ఈ సినిమాకు ‘వీరమాస్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇదిలావుంటే.. బాబీ చేయబోయే నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
బాలయ్య సినిమా తర్వాత రవితేజతో చేయి కలుపనున్నారట బాబీ. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నదని తెలుస్తున్నది. రవితేజతో బాబీ చేసిన పవర్, వాల్తేరు వీరయ్య సినిమాలు రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. మళ్లీ ఈ ఇద్దరు కలుస్తున్నది నిజమే అయితే.. హ్యాట్రిక్ పక్కా అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.