అగ్రహీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రణబాలి’. 19వ శతాబ్దంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా సినిమా విడుదల కానున్నది. ఆదివారం రష్మిక మందన్నా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బర్త్‌డే స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జయమ్మగా రష్మిక మారిన పరిణామక్రమాన్ని చూపించారు. ‘రణబాలి బలం జయమ్మ.. అతని సంతోషాలకు కారణం జయమ్మ’ అంటూ వీడియోలో పేర్కొనడం ఈ జంట మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది. ఇటీవలే ఈ సినిమా అనంతపూర్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న విషయం విదితమే.
ఇదిలావుంటే ఈ సందర్భంగానే రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’ నుంచి ఓ కొత్త పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. యుద్ధం చేసి, గాయాలతో అగ్రహంగా కనిపిస్తున్న రష్మికను ఈ పోస్టర్లో చూడొచ్చు. గోండ్ తెగల సాంస్కృతి నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇదని, ఇందులో ఇప్పటివరకూ చూడని శక్తివంతమైన పాత్రలో రష్మికను చూస్తారని, ఎమోషన్, యాక్షన్ మేళవింపుగా పానిండియా స్థాయిలో భారీగా ఈ చిత్రం తెరకెక్కుతున్నదని మేకర్స్ తెలిపారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది.