Rashmika | ఛలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించి ఆ తర్వాత మంచి విజయాలు అందుకొని బాలీవుడ్‌లోను సత్తా చాటుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండతో ఎఫైర్ విషయంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. అయితే రష్మిక ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడింది. ఆమె జీవితం పూలపాన్పు ఏమీ కాదు. చిన్నప్పుడుఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ అమ్మడు ఎన్నో అవరోధాలని ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరింది.
బాల్యంలో తన తల్లిదండ్రులు అద్దె కట్టలేక ఎన్నోసార్లు ఇళ్లు మారాల్సి వచ్చిందని, పేరెంట్స్ పడుతున్న కష్టాలు చూసి కనీసం ఓ బొమ్మ కొనివ్వమని కూడా అడిగేదాన్ని కాదంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే చిన్నప్పుడు పడ్డ ఆ ఆర్థిక కష్టాలే తనకు డబ్బు విలువ తెలియజేసేలా చేసిందని పేర్కొంది. కెరీర్ విషయంలో స్థిరంగా ఉండాలని, మనసుకు నచ్చిన పని చేయాలని తాను అందరికీ సలహా ఇస్తానంటూ రష్మిక పేర్కొంది. కూర్గ్ లాంటి ఒక చిన్న పట్టణంలో పుట్టిన తాను, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడమే అని తెలియజేసింది. ఈ ప్రయాణంలో ఎదురయ్యేవి కఠినమైన పాఠాలు కావు, అన్నీ విలువైన అనుభవాలే. ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండేందుకు ప్రయత్నించండి. కానీ, ఇతరులను సంతోషపెట్టాలనే భారాన్ని మాత్రం మోయకండి. మీ ఆనందంపై దృష్టి సారించండి అని స్పూర్తిదాయకమైన సలహాలు ఇచ్చింది.
ఇక ఒక అభిమాని, “జీవితంలో ప్రతిదీ తప్పుగా జరిగే సమయంలో, కనీసం బతకాలని కూడా అనిపించకపోతే, ఎలా ఎదుర్కోవాలి? నేను విలువలేని మనిషినిగా అనిపిస్తోంది. దయచేసి సూచనలివ్వండి” అంటూ రష్మికను అడిగారు.దానికి స్పందించిన రష్మిక.. , “నీకు నమ్మకంగా ఉన్న వాళ్ళ మధ్య ఉంటే ఈ రోజు కూడా గడిచిపోతుంది అని నమ్మాలి. అదే పనిని రేపూ, ఎల్లుండీ కొనసాగిస్తూ ఉంటే ఆ తరువాత నీకే అర్థం అవుతుంది.. నీవు ఎదుగుతున్నావు అని, కష్టాలని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నావు అని. ఆ తర్వాత నీ శక్తిని చూసి నీకే గర్వంగా అనిపిస్తుంది అంటూ రష్మిక చాలా తెలివిగా అభిమానికి సమాధానం ఇచ్చింది. ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తుంది. కాగా, రష్మిక మందన్న గత రెండేళ్లలో నటించిన మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు యానిమాల్, పుష్ప 2, ఛావా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3వేల 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.