ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కథానాయికగా తన లక్ష్యమని, భాషాపరమైన హద్దులు లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. గతేడాది ఈ భామ ఖాతాలో ఛావా, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ వంటి భారీ విజయాలున్నాయి. ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాలపై దృష్టిపెడుతున్నది.
తాజాగా అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది రష్మిక మందన్న. ‘ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ప్రేమకథలతో పాటు కమర్షియల్ చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్.. ఇలా సినిమాల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నా’ అని ఆమె చెప్పింది. సోషల్‌మీడియా ట్రోల్స్ గురించి స్పందిస్తూ ‘సినీ సెలబ్రిటీలపై నెగెటివ్ న్యూస్ రావడం సాధారణమే. అలాంటి వార్తల ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
వాళ్లు కూడా బతకాలని వదిలేస్తా. అయితే ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఏదో ఒకరోజు మాత్రం నిజం తెలుస్తుందని నా నమ్మకం. అందుకే ఒకప్పుడు రూమర్స్ విన్నప్పుడే బాధగా అనిపించేది. కానీ ఇప్పుడు వాటిని ఎలా కౌంటర్ చేయాలో తెలుసుకున్నా’ అని వివరించింది రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మైసా’, హిందీలో ‘కాక్ టెయిల్-2’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.