కన్నడ సోయగం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. చేతినిండా భారీ ఆఫర్లతో విరామం లేకుండా శ్రమిస్తున్నది. హిందీలో ఈ అమ్మడు రణభీర్‌కపూర్ సరసన ‘యానిమల్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘యానిమల్’ చిత్రం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని, ఈ సినిమా ద్వారా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని చెప్పింది.
త్వరలో ‘పుష్ప-2’ చిత్రీకరణలో జాయిన్ కాబోతున్నానని వెల్లడించింది. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘ఈ టీమ్‌తో మరో వంద చిత్రాలైనా చేస్తాను. ప్రతి ఒక్కరూ స్నేహభావంతో ఉంటూ షూటింగ్‌ను మరచిపోయేలా చేశారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తన వృత్తిని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆర్టిస్టులకు స్వేచ్ఛనివ్వడంతో పాటు తనదైన సృజనాత్మకతతో సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడు. ఇక రణభీర్‌కపూర్‌తో వర్క్ చేయడం లైఫ్‌టైమ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఈ చిత్రం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.