Rashmika Mandanna | కన్నడ కస్తూరి రష్మిక మందన్న సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే గత రెండుమూడు వారాలుగా ఈ భామ సోషల్‌మీడియాకు దూరమైంది. షూటింగ్ బిజీలో ఉండటం వల్ల సోషల్‌మీడియాకు కాస్త బ్రేక్‌నిచ్చిందని అందరూ అనుకున్నారు.
తాజా పోస్ట్‌లో తన బ్రేక్‌కు గల కారణాన్ని వివరించింది రష్మిక మందన్న. గత నెలలో తాను చిన్న ప్రమాదానికి గురయ్యానని, దాంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నానని, ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఫిట్‌గా తయారయ్యానని పేర్కొంది. ‘ప్రమాదం చాలా చిన్నదే. డాక్టర్ల సలహా మేరకు రెండు వారాలు ఇంటిదగ్గరే విశ్రాంతి తీసుకున్నా. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. తిరిగి మీ ముందుకు రావడానికి ఉత్సాహంగా ఉన్నా’ అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రష్మిక మందన్న చెప్పింది.