అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత నెలలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తమ నిశ్చితార్థం గురించి విజయ్, రష్మిక ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఎంగేజ్మెంట్ విషయంలో వారు గోప్యతను పాటిస్తున్నట్లు అర్థమవుతున్నది. ఈ ప్రేమజంట ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న ఎక్కడకు వెళ్లినా నిశ్చితార్థం తాలూకు ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
తన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్లో భాగంగా జగపతిబాబు నిర్వహిస్తున్న ఓ టాక్‌షోకు హాజరైంది రష్మిక మందన్న. ఈ సందర్భంగా ఆమె చేతికి ధరించిన నిశ్చితార్థ ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ‘విజయ్’ అనే పేరున్న ముగ్గురు హీరోలను ఉదహరించిన జగపతిబాబు.. వారితో ఉన్న అనుబంధం గురించి చెప్పమని రష్మికను ఓ సరదా ప్రశ్న అడిగారు. అందుకు రష్మిక..విజయ్ దేవరకొండ అంటే స్నేహం, విజయ్ సేతుపతి అంటే అభిమానం, దళపతి విజయ్ అంటే తన ఆల్‌టైమ్ అభిమానం అని చెప్పింది. అప్పుడు జగపతిబాబు ‘నువ్వు నీ జీవితంలో విజయాలతో పాటు విజయ్‌ని కూడా దక్కించుకున్నావ్’ అంటూ రష్మికను ఆటపట్టించే ప్రయత్నం చేశారు.
చేతికి ఉన్న ఉంగరాల గురించి అడిగినప్పుడు..అవి తన జీవితంలో చాలా ప్రత్యేకమని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.. ఈ కార్యక్రమం ఆద్యంతం రష్మిక మందన్న హుషారుగా కనిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రష్మిక మందన్న నిశ్చితార్థ శోభతో వెలిగిపోతున్నదంటూ కామెంట్స్ చేశారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది.