కథానాయికలు రష్మిక మందన్న, రుక్మిణి వసంత్ ఈ ఏడాది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినిమాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని, రేటింగ్స్‌ను అందిస్తూ సినీ ప్రేమికుల అభిమానాన్ని పొందిన ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) సంస్థ ఈ ఏడాది భారతీయ సినిమాలో వివిధ కేటగిరీలలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులు, దర్శకుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రష్మిక మందన్న, రుక్మిణి వసంత్ చోటు సంపాదించారు. రష్మిక మందన్న ఈ ఏడాది తిరుగులేని విజయాలను సాధించింది.
ఆమె నటించిన ‘ఛావా’ ‘థామా’ ‘కుబేర’ ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇక రుక్మిణి వసంత్ ‘కాంతార చాప్టర్-1’తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. దీనితో పాటు ‘ఏస్’ ‘మదరాసి’ చిత్రాలు సైతం ఈ భామకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఇక ఐఎండీబీ జాబితాలో హిందీ చిత్రం ‘సైయారా’ జోడీ అహాన్ పాండే, అనీత్ పడ్డా తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. 40కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘సైయారా’ బాక్సాఫీస్ వద్ద 400కోట్లకుపైగా వసూళ్లను సాధించడం విశేషం. ‘కూలీ’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన అమీర్‌ఖాన్ మోస్ట్‌పాపులర్ యాక్టర్స్ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. దర్శకులు మోహిత్ సూరి (సయారా), లోకేష్ కనకరాజ్ (కూలీ), అనురాగ్‌కశ్యప్ (నిశాంచి, బందర్) అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకులుగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.