మాతృభాష కన్నడంలోనే సినీ కెరీర్‌ను మొదలుపెట్టింది కథానాయిక రష్మిక మందన్న. ఆ తర్వాత తెలుగు, హిందీ పరిశ్రమల్లో అగ్రనాయికగా పేరు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా కన్నడ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం వల్ల అక్కడి సోషల్‌మీడియాలో రష్మిక మందన్నపై దుష్ప్రచారం మొదలైంది. కన్నడ సినిమాపై ఆమెకు ఏ మాత్రం ప్రేమలేదని, అందుకే పరభాషా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శలొచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అంతగా పట్టించుకోలేదు రష్మిక మందన్న. తన తాజా హిందీ చిత్రం ‘థామా’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ రూమర్స్‌పై ఆమె స్పందించింది. కన్నడ ఇండస్ట్రీ తనపై బ్యాన్ విధించిందనే ప్రశ్నను కొట్టిపారేసింది. ఏ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేయలేదని స్పష్టతనిచ్చింది.
కొందరు అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని చెప్పింది. ‘కాంతార చాప్టర్-1’ విజయంపై రష్మిక స్పందించడం లేదనే విమర్శలు కూడా వచ్చాయి. వీటిపై మాట్లాడుతూ ‘విడుదలైన కొన్ని రోజుల తర్వాత నేను సినిమాలు చూస్తాను. ‘కాంతార -2’ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా చూశా. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ పెట్టాను. వారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. చాలా మందికి తెర వెనక ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి విషయాన్ని నేను సోషల్‌మీడియా ద్వారా పంచుకోలేను. అందుకే ఎవరేమనుకున్నా పట్టించుకోను. నా నటన గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారన్నదే నాకు ముఖ్యం’ అని రష్మిక మందన్న పేర్కొంది.