ఎట్టకేలకు రష్మిక.. తన మదిలో దాగున్న మాటను బయట పెట్టింది. విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందని, వారిద్దరికీ గత నెలలో నిశ్చితార్థం జరిగిందని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా ధృవీకరించలేదు. రీసెంట్గా జరిగిన ఓ చిట్‌చాట్‌లో అసలు విషయాన్ని బయటకు చెప్పేసింది రష్మిక. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మికను ‘జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?’ అని అడగ్గా.. ‘ప్రపంచం నన్ను వ్యతిరేకించినా.. తను మాత్రం నాకోసం నిలబడాలి. అవసరం అయితే.. నా కోసం యుద్ధం చేయాలి. అలాంటి భాగస్వామే నాక్కావాలి’ అని సమాధానమిచ్చారు రష్మిక. ఇంకా చెబుతూ ‘మీకర్థమయ్యేలా చెప్పాలంటే.. నన్ను లోతుగా అర్థం చేసుకోవాలి.
ప్రతి విషయాన్నీ నావైపు నుంచి ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలగాలి. మంచి వ్యక్తిత్వం ఉండాలి. ఈ లక్షణాలున్నవాడు దొరికితే యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా’ అని చెప్పారు రష్మిక. ఒకవేళ డేట్ అయితే ఎవరితో చేస్తారు? పైళ్లి ఎవర్ని చేసుకుంటారు? అని అడగ్గా.. ‘యానిమేషన్ క్యారెక్టర్ ‘నరుటో’ అంటే నాకెంతో ఇష్టం. డేట్ చేయాల్సొస్తే ‘నరుటో’తో చేస్తా. పెళ్లి అయితే మాత్రం విజయ్‌నే చేసుకుంటా’ అంటూ తడుముకోకుండా ఉన్నమాట చెప్పేసి అందంగా నవ్వేసింది రష్మిక. అంతే.. ఒక్కసారిగా రష్మికకు అభినందనలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్-రష్మికల వివాహం రాజస్థాన్ ఉదయపూర్‌లో జరుగనున్నదని టాక్ వినిపిస్తున్నది.