తన భర్త, బాలీవుడ్ అగ్రనిర్మాత ఆదిత్య చోప్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నది రాణి ముఖర్జీ. ఆయన సింపుల్ లైఫ్ స్టయిల్‌తోపాటు ఏమాత్రం గర్వం లేకుండా ఉండటం వల్లే ఆయన్ని ప్రేమించానేమో?! అంటున్నది. తాజాగా, ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఈ బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరోయిన్.. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో ఓ చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర ముచ్చట్లను పంచుకున్నది. తన భర్త, బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాతో తన అనుబంధం గురించి వెల్లడించింది.
“ఆదిత్య చాలా మామూలుగా ఉండటానికే ఇష్టపడతాడు. తన తల్లిదండ్రులను గౌరవించే విధానం కూడా గొప్పది. ఆయన సింపుల్ లైఫ్‌స్టయిల్ కూడా నాకు బాగా నచ్చేది. బాలీవుడ్ అగ్ర నిర్మాత యష్ చోప్రా కొడుకుననీ, తానూ ఓ గొప్ప నిర్మాతననే విషయాన్ని ఆయన అస్సలు నెత్తికి ఎక్కించుకునేవాడు కాదు. అందుకే, ఆయన్ని నేను ప్రేమించానేమో?!” అంటూ ఆదిత్యా చోప్రాను ఆకాశానికి ఎత్తేసింది.
ఇక తన ముద్దుల తనయ అదిరా గురించి చెబుతూ.. ఆమె దివంగత యష్ చోప్రా పునర్జన్మ కావొచ్చని అంటున్నది. “ఆమె నూటికి నూరుపాళ్లు యష్ చోప్రా మనవరాలు. నిజాయతీగా చెప్పాలంటే.. ఆమె యష్ చోప్రా పునర్జన్మ కావచ్చు!” అంటూ చెప్పుకొచ్చింది.