బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌బీర్‌కపూర్ అయోధ్యలో 3.31కోట్ల విలువైన స్థలాన్ని కొనుగోలు చేశారు. 2,134 స్కేర్ఫీట్స్తో కూడిన ఈ ప్లాట్ సరయు నదీతీరంలోని ఓ ప్రీమియర్ వెంచర్‌కు సంబంధించినదిగా తెలిసింది. ప్రస్తుతం రణ్‌బీర్‌కపూర్ భారతీయ పురాణేతిహాసం ‘రామాయణ’ చిత్రంలో రాముడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రణ్‌బీర్‌కపూర్ భూమిని కొనుగోలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆయోధ్య నగరానికి ఉన్న సాంస్కృతిక, ధార్మిక విశిష్టత దృష్ట్యా పలువురు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు అక్కడ భూమి కొనుగోలు చేయడానికి ఆస్తకిగా ఉన్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో భూమి కొనడంపై రణ్‌బీర్‌కపూర్ భావోద్వేగభరితంగా స్పందించారు. అయోధ్యే తనను ఎంచుకుందని, ఆ దైవం పిలుపుకు తాను సమాధానమిచ్చానని వ్యాఖ్యానించారు. నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ తొలిభాగం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది.