‘కాంత’ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద కనిపించడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారని అన్నారు హీరో రానా. ఆయన దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన పీరియాడిక్ ఎంటర్టైనర్ ‘కాంత’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రానా మాట్లాడారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచారని, విజువల్స్, మ్యూజిక్లాంటి అంశాలు ఉన్నత ప్రమాణాలతో ఉన్నాయనే ప్రశంసలొస్తున్నాయని చెప్పారు.
‘ఇండిపెండెంట్ ఆర్ట్ సినిమాలంటే నాకూ, దుల్కర్‌కు బాగా ఇష్టం. అందుకే ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాం. మా టీమ్ అందరి అంచనాలను నిజం చేసిన చిత్రమిది. ఇది ఏ నటుడి బయోపిక్ కాదు. 50 దశకం నాటి కథ కాబట్టి అప్పటి సినిమాల రిఫరెన్స్‌లను చూపించాం’ అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి పాత సినిమాలంటే ఇష్టమని, ఈ సినిమా కోసం సావిత్రి, శ్రీదేవి నటించిన చిత్రాల్ని చూశానని కథానాయిక భాగ్యశ్రీ బోర్సే చెప్పింది.